Ukraine Crisis: అమెరికా నేరుగా మాతో యుద్ధానికి దిగుతోంది: రష్యా

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా.. తాజాగా అగ్రరాజ్యంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను అమెరికా సమన్వయం చేస్తోందని.......

Published : 08 May 2022 02:06 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా.. తాజాగా అగ్రరాజ్యంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను అమెరికా సమన్వయం చేస్తోందని, ఈ చర్య రష్యాతో నేరుగా సైనిక చర్యలో పాల్గొన్నట్లేనని సీనియర్ చట్టసభ్యుడు వ్యచెస్లామ్‌ వొలోదిన్‌ పేర్కొన్నారు. ‘కీవ్‌లో సైనిక కార్యకలాపాలను వాషింగ్టన్ సమన్వయం చేస్తూ, సైనిక పరిస్థితులను మెరుగుపరుస్తోంది. తద్వారా రష్యాకు వ్యతిరేకంగా సైనిక చర్యలలో నేరుగా పాల్గొంటోంది’ వొలోదిన్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో రాసుకొచ్చారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచీ బాధిత దేశానికి అగ్రరాజ్యం అండగా నిలుస్తూనే వస్తోంది. సైనిక బలగాల పరంగా ఉక్రెయిన్‌కు కావాల్సిన పూర్తి మద్దతు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. యుద్ధ ట్యాంకులు, ఇతర పేలుడు పదార్థాలను అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉక్రెయిన్‌కు 800 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడంతో ఆ దేశ ఆయుధాల సంఖ్య, స్థాయి భారీగా పెరిగిపోయింది. 40,000 శతఘ్ని గుండ్లు, శతఘ్నులు, 11 ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.

ఉక్రెయిన్‌కు మరో 3,300 కోట్ల డాలర్ల సాయం అందించడానికి అనుమతించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ను బైడెన్‌ గత నెలాఖరులో కోరారు. ఉక్రెయిన్‌కు మరింత కాలం సాయమందించే ఉద్దేశం అమెరికాకు ఉందన్న సంకేతాన్ని ఆయన వెలువరించారు. సైనిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆర్థిక, మానవతా సాయానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. రష్యా కుబేరుల ఆస్తుల్ని జప్తు చేయడానికి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉక్రెయిన్‌కు సాయంగా వాడేందుకు అనుమతించాలని కాంగ్రెస్‌ను బైడెన్‌ కోరారు. మార్చిలో మొత్తంగా 1,360 కోట్ల డాలర్ల సాయానికి ఆమోదం లభించగా ఆ మొత్తమంతా దాదాపు ఖర్చయిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని