North Korea: ఉత్తర కొరియా దూకుడు.. మరో క్షిపణి ప్రయోగం!

అగ్రరాజ్యం హెచ్చరికలను పెడచెవిన పెడుతూ.. ఉత్తర కొరియా తన క్షిపణుల ప్రయోగాలు చేపడుతూనే ఉంది. తాజాగా ఈ దేశం తన తూర్పు తీరం నుంచి గుర్తుతెలియని ప్రొజెక్టైల్‌ను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గురువారం ఓ ప్రకటనలో...

Published : 24 Mar 2022 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం హెచ్చరికలను పెడచెవిన పెడుతూ.. ఉత్తర కొరియా తన క్షిపణుల ప్రయోగాలు చేపడుతూనే ఉంది. తాజాగా ఈ దేశం తన తూర్పు తీరం నుంచి గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జపాన్ కోస్ట్‌గార్డ్ సైతం దీన్ని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంగా అనుమానిస్తూ.. తమ నౌకలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ క్షిపణి.. తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌(ఈఈజడ్‌) జలాల్లో పడిపోయినట్లు జపాన్‌ ప్రభుత్వం తెలిపింది. ‘ప్రస్తుత విశ్లేషణల ప్రకారం ఆ బాలిస్టిక్ క్షిపణి 71 నిమిషాల పాటు గాల్లో ఎగిరి.. హొక్కైదొ ఒషిమా ద్వీపకల్పానికి తూర్పున 150 కి.మీల దూరంలో జపాన్ సముద్రంలోని తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌ జలాల్లో పడిపోయింది’ అని ఆ దేశ రక్షణశాఖ మంత్రి మకోటో ఒనికి చెప్పారు.

తాజా ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగంగా భావిస్తున్నాయి. 2017 తర్వాత పూర్తి సామర్థ్యంతో కూడిన అతిపెద్ద ప్రయోగం ఇదేనని అనుమానిస్తున్నాయి. ‘ఈసారి బాలిస్టిక్ క్షిపణి ఆరు వేల కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించింది. ఇది 2017 నవంబరులో ప్రయోగించిన హ్వాసాంగ్-15 ఐసీబీఎం కంటే చాలా ఎక్కువ’ అని జపాన్‌ మంత్రి ఒనికి అన్నారు. క్షిపణుల ప్రయోగాల విషయంలో ఉత్తర కొరియా ఈ ఏడాది మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియా సైన్యం వివరాల ప్రకారం.. తాజా ప్రయోగం ఈ ఏడాదిలో 13వది. ఫిబ్రవరి 27న, మార్చి 5న సైతం.. ఐసీబీఎంలను పరీక్షించినట్లు వార్తలు రాగ.. అవి నిఘా ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించినవి అని ఉత్తర కొరియా తెలిపింది. గత వారం కూడా.. ఓ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించగా, అది ప్రయోగించిన వెంటనే గాల్లో పేలిందని దక్షిణ కొరియా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు