Sergei Lavrov: రష్యా వ్యతిరేక కూటమిలోకి భారత్‌ను లాగే యత్నం!

రష్యా వ్యతిరేక కూటమిలోకి భారత్‌ను లాగేందుకు ‘నాటో(NATO)’ ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergei Lavrov) ఆరోపించారు. అదే విధంగా.. రష్యాకూ ముప్పు వాటిల్లేలా చైనా సమీపంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.

Published : 02 Dec 2022 01:35 IST

మాస్కో: రష్యా వ్యతిరేక కూటమిలోకి భారత్‌ను లాగేందుకు ‘నాటో(NATO)’ ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergei Lavrov) ఆరోపించారు. అదే విధంగా.. రష్యాకూ ముప్పు వాటిల్లేలా చైనా సమీపంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. ‘నాటో తన ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న ప్రాంతాల్లో ఇప్పుడు దక్షిణ చైనా సముద్రాన్ని చేర్చుతోంది. ఉక్రెయిన్‌ విషయంలోనూ ఇలాగే చేసి.. ఉద్రిక్తతలు పెంచింది’ అని లావ్రోవ్‌ ఓ సమావేశంలో అన్నారు.

చైనా, తైవాన్‌ల మధ్య వివాదాన్ని పేర్కొంటూ.. ‘ఈ ప్రాంతంలో ‘నాటో’ నిప్పుతో చెలగాటం ఆడుతోంది. దీంతో రష్యాకూ ముప్పే. ఈ ప్రాంతం.. చైనా భూభాగానికి ఎంత దగ్గరగా ఉందో.. మాకూ అంతే దగ్గరగా ఉంది’ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా.. చైనాతో సైనిక సహకారాన్ని పెంచుకుంటోందని, ఉమ్మడి విన్యాసాలు నిర్వహిస్తోందని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు రష్యా ప్రభావాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని లావ్రోవ్‌ వ్యాఖ్యానించారు. ‘తైవాన్‌ ప్రాంతంలో అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు.. విధ్వంస పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయనే విషయం అందరికీ తెలుసు’ అని అన్నారు. అయితే, తన వాదనలకు బలం చేకూర్చేలా ఆయన ఎటువంటి ఆధారాలు అందించకపోవడం గమనార్హం. కానీ, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల మధ్య కూటమి(AUKUS) ఏర్పాటును ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని