UNDP: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాలు మరింత తీవ్రం

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముదురుతోందనే సంకేతాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

Published : 11 Oct 2022 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముదురుతోందనే సంకేతాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ పేదల్లో సగం మందికిపై నివసిస్తున్న 54 దేశాలకు తక్షణమే రుణాలు అందకపోతే ప్రజలు మరింత పేదరికంలోకి జారుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభం మొదలైంది. ఇది మరింత అధ్వానంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని ఆ సంస్థ మంగళవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. 

శ్రీలంక, పాకిస్థాన్‌, చాద్‌, ఇథియోపియా, జాంబియాలు రుణసంక్షోభాల్లో కూరుకుపోయిన సమయంలో ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ వాషింగ్టన్‌లో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఇదే సమయంలో యూఎన్‌డీపీ హెచ్చరికలు వెలువడటం గమనార్హం. యూఎన్‌డీపీ అడ్మిన్‌స్ట్రేటర్‌ అచిమ్‌ స్టెయినర్‌ మాట్లాడుతూ.. రుణాలను రైటాఫ్‌ చేయడం, చాలా దేశాలకు ఉపశమనాలు అందించడం, ఆయా దేశాల బాండ్‌ కాంట్రాక్టులకు ప్రత్యేక క్లాజ్‌లు జోడించడం వంటివి ప్రయోజనకరంగా ఉండొచ్చన్నారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ చేయకపోతే మాత్రం పేదరికం పెరిగిపోవడం ఖాయమని స్టెయినర్‌ వెల్లడించారు. 

జీ20 దేశాల నేతృత్వంలోని కామన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్లాన్‌ను మరోసారి అవసరమైన మార్పులు చేసుకోవాలని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. కొవిడ్‌ సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న దేశాలకు సాయం చేసేలా రుణ పునర్‌ వ్యవస్థీకరణ కోసం ఈ ప్లాన్‌ను తయారు చేశారు. దీనిని ఇప్పటి వరకు చాద్‌, ఇథియోపియా, జాంబియా మాత్రమే వినియోగించుకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని