Published : 28 Jul 2022 02:01 IST

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు టీకా.. భారత్‌కు ఎప్పుడు వస్తుందంటే..?

సీరం చీఫ్‌ అదర్‌ పూనావాలా

దిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (Monkeypox) ఆయా దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా ప్రజారోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. మనదేశంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదుకాగా కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మంకీపాక్స్‌ వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ (Monkeypox Vaccine) కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యాక్సిన్‌ పంపిణీ అనివార్యమైన తరుణంలో దీనిని దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్‌కు చెందిన సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఆ సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు.

ఏడాది పట్టొచ్చు.. ఐనా ఆందోళన వద్దు..

‘ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్‌ కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే విషయంపై మరికొన్ని నెలలపాటు వేచిచూసి నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఒప్పందం కుదిరితే వచ్చే రెండు, మూడు నెలల్లోనే భారత్‌కు వ్యాక్సిన్‌ దిగుమతి చేసుకుంటాము’ అని వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. స్థానికంగా తయారు చేయడం ఇప్పుడు మొదలుపెడితే.. మార్కెట్‌లోకి రావడానికి ఏడాది సమయం పడుతుందన్నారు.

అందరికీ అవసరం లేదు

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇది మహమ్మారిలా వ్యాపించదని అదర్‌ పూనావాలా స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో జనాభా అందరికీ ఈ వ్యాక్సిన్‌ అవసరం లేదని.. వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో వేస్తే సరిపోతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ వైరస్‌ వ్యాప్తిలో ఉందన్న ఆయన.. ఈ వైరస్‌ వల్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలు తీసుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ సూచించారు.

మరోవైపు భవిష్యత్తులో మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ అవసరమైన నేపథ్యంలో వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై ప్రైవేటు వ్యాక్సిన్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లేదన్న ఆయన.. కేవలం స్మాల్‌పాక్స్‌కు (Smallpox) మాత్రమే వ్యాక్సిన్‌ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

స్మాల్‌పాక్స్‌ టీకానే..

 స్మాల్‌పాక్స్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను డెన్మార్క్‌కు చెందిన బవారియన్‌ నార్డిక్‌ (Bavarian Nordic) అనే సంస్థ తయారు చేసింది. Jynneos, Imvamune or Imvanex అనే బ్రాండ్ల పేరుతో అమెరికా, యూరప్‌ దేశాల మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. అయితే, మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లేనప్పటికీ స్మాల్‌పాక్స్‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌నే మంకీపాక్స్‌ నిరోధానికి ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని