Srilanka Crisis: రాజపక్స అనుయాయులు దేశం వీడి పారిపోకుండా చెక్‌పాయింట్‌!

ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై మాజీ ప్రధాని మహీంద రాజపక్సే మద్దతుదారుల దాడులతో తీవ్ర ఘర్షణలు చెలరేగిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు......

Updated : 10 May 2022 21:12 IST

కొలంబో: ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై మాజీ ప్రధాని మహీంద రాజపక్సే మద్దతుదారుల దాడులతో తీవ్ర ఘర్షణలు చెలరేగిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ప్రధాని మహీంద రాజపక్స నివాసంపై ఆందోళనకారుల దాడితో ఆయన కొలంబోను వదిలి పారిపోయారు. ట్రింకోమలి నౌకా కేంద్రంలో ఆయన ఆశ్రయం పొందుతుండగా అక్కడా నిరసనలు హోరెత్తాయి. ఈ హింసకు కారణమైన మహీందను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. మరోవైపు, నిన్న నిరసనకారులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య చెలరేగిన ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను శ్రీలంక అటార్నీ జనరల్‌ ఆదేశించారు. రాజపక్స కుటుంబ అనుయాయులు దేశం విడిచి పారిపోవడాన్ని నిరోధించేందుకు  కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు చెక్‌పాయింట్‌ ఏర్పాటు చేశారు.  దేశవ్యాప్తంగా నిన్న ప్రకటించిన కర్ఫ్యూని బుధవారం వరకు పొడిగించారు. అలాగే, రాజధాని నగరం కొలంబో సహా కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

హింస, ప్రతీకారం వీడండి..: గొటబాయ విజ్ఞప్తి

శ్రీలంకలో ఘర్షణలు కొనసాగుతున్న వేళ శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. హింసను ఆపాలని.. రాజకీయాలకు అతీతంగా ప్రతీకార చర్యలు మానుకోవాలని కోరారు. ఏకాభిప్రాయం ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. మరోవైపు, నిన్న చెలరేగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరగా.. కొలంబో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కలిపి దాదాపు 250 మంది గాయపడ్డారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని