Europe: ఐరోపాలో కరవు కథాచిత్రం.. గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా దుర్భర పరిస్థితులు

ఐరోపా ఖండం కరవు గుప్పిట చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం వెతుక్కోవాల్సి వస్తోంది. ఫ్రాన్స్‌లో ఎప్పుడూ

Published : 13 Aug 2022 07:53 IST

ఎండిపోతున్న నదులు, చెరువులు

పశువులకు మేత, నీటికి సైతం ఇబ్బందులు

రైన్‌, డాన్యూబ్‌ నదుల్లో జల రవాణాకు ఆటంకాలు

లక్స్‌ (ఫ్రాన్స్‌): ఐరోపా ఖండం కరవు గుప్పిట చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం వెతుక్కోవాల్సి వస్తోంది. ఫ్రాన్స్‌లో ఎప్పుడూ ఆకుపచ్చని శోభతో కళకళలాడే. బుర్గుండీ రిజియన్‌లో వర్షాలు లేక గడ్డి పసుపు, గోధుమ వర్ణంలోకి మారిపోయింది. ఆ ప్రాంతంలో ప్రవహించే టిజ్‌ నది ఎండిపోయింది. చేపలు ఎండబెట్టారా అన్నట్లుగా నదీగర్భం చనిపోయిన మత్స్యాలతో దర్శనమిస్తోంది. స్పెయిన్‌లో ఎండిపోయి నెర్రలు తేలిన రిజర్వాయర్లు కనిపిస్తున్నాయి. ప్రధాన నదులైన డాన్యూబ్‌, రైన్‌, ఇటలీలోనే అత్యంత పొడవైన ద పొ నదుల్లో ప్రవాహాలు అడుగంటిపోయాయి. ఫలితంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతోపాటు, నీటి వినియోగంపై ఆంక్షలు తప్పడం లేదు. కొన్నిచోట్ల కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. జలచరాలకు ముప్పు పొంచి ఉంది. పశ్చిమ, మధ్య, దక్షిణ ఐరోపాల్లో రెండు నెలలుగా చెప్పుకోదగిన స్థాయిలో వర్షమే కురవలేదు. సాధారణంగా వర్షాలు కురవాల్సిన బ్రిటన్‌లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. చరిత్రలో అత్యంత వేడి, పొడి వాతావరణంతో కూడిన వేసవి కాలాల్లో ఒకటిగా ప్రస్తుత వేసవి రికార్డులకు ఎక్కనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దక్షిణ, మధ్య ఇంగ్లండ్‌లో శుక్రవారం అధికారికంగా కరవును ప్రకటించింది.

నీటి వినియోగంపై తప్పని ఆంక్షలు..

తాజా కరవు పరిస్థితుల నేపథ్యంలో ఐరోపాలోని పలు దేశాలు నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్నిచోట్ల రైతులు పశువులకు కొళాయి నీటితో దాహార్తి తీర్చుతున్నారు. ఒక ఆవుకు సగటున రోజుకు వంద లీటర్ల నీటిని అందిస్తూ వాటిని కాపాడుకుంటున్నారు. రానున్న రోజుల్లో రైన్‌ నదిలో నీరు మరింతగా ఎండిపోనుందని, ఫలితంగా బొగ్గు, చమురు సహా వస్తువుల రవాణాకు ఆటంకాలు తప్పవని భావిస్తున్నారు. సెర్బియాలో అధికారులు పడవల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు డాన్యూబ్‌ నదిలో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. హంగరీలోని బుడాపెస్ట్‌లో ప్రముఖ సరస్సు వెలెన్స్‌లో చాలాచోట్ల ఎండిపోయి దిబ్బలు కనిపిస్తున్నాయి. ఇటలీలోనే అత్యంత పొడవైన ‘ద పొ’ నది కూడా వేగంగా ఎండిపోతోంది. ఫలితంగా దశాబ్దాల క్రితం మునిగిపోయిన బార్జ్‌లు, పడవులు దర్శనమిస్తున్నాయి.

వాతావరణ మార్పులే కారణం

వాతావరణ మార్పులు గడ్డు పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అత్యంత వేడి వాతావరణం.. జలవనరులు ఆవిరి అవడాన్ని వేగవంతం చేస్తున్నాయి. చెట్లు నేలలోని మరింత తేమని పీల్చుకుంటున్నాయి. చలికాలం హిమపాతం తగ్గిపోతుండడంతో వేసవిలో వ్యవసాయ అవసరాలకు కావాల్సిన తాజా నీరు దొరకడం లేదు. కరవు పరిస్థితులు మరింత తీవ్రం అవుతాయని, మొత్తం 47 శాతం ఐరోపా ఖండం ప్రభావితం కానుందని ఐరోపా సంఘం సంయుక్త పరిశోధన కేంద్రం ఈ వారమే హెచ్చరించింది. ఐరోపా డ్రాట్‌ అబ్జర్వేటరీ సీనియర్‌ పరిశోధకుడు ఆండియా టొరెటి మాట్లాడుతూ.. గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంతస్థాయిలో 2018లో తీవ్రమైన కరవు సంభవించిందని, ఈ ఏడాది పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. రానున్న మూడు నెలల్లో పశ్చిమ, మధ్య ఐరోపాలో, బ్రిటన్‌లో అత్యంత తీవ్రమైన పొడి పరిస్థితులను చూడొచ్చని హెచ్చరించారు. ప్రపంచ వాతావరణ వ్యవస్థల్లో మార్పుల కారణంగా సంభవించిన సుదీర్ఘ పొడి వాతావరణం కారణంగానే ప్రస్తుత పరిస్థితి ఉద్భవించిందని బెర్లిన్‌ సమీపంలోని పోట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చ్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త పీటర్‌ హాఫ్‌మన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని