China Lockdown: లాక్‌డౌన్‌తో షాంఘై ఉక్కిరిబిక్కిరి.. 6వ రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు!

కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న చైనాలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా ఆరోరోజు 20వేలకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Published : 07 Apr 2022 22:43 IST

కఠిన ఆంక్షలపై చైనీయుల్లో ఆగ్రహం

బీజింగ్‌: కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా ఆరో రోజూ 20వేలకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా షాంఘై నగరం చైనాలో కొవిడ్‌  కేంద్ర బిందువుగా మారింది. వైరస్‌ని కట్టడి చేసేందుకు ఇప్పటికే అక్కడ లాక్‌డౌన్‌ విధించి భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. చైనాలో బుధవారం ఒక్కరోజే 21,784 కేసులు నమోదు కాగా.. అందులో 19,660 కేసులు కేవలం ఒక్క షాంఘైలోనే వచ్చినట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

2.6కోట్ల జనాభా కలిగిన షాంఘైలో ఇప్పటికే లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మూడు రౌండ్లలో కొవిడ్‌ పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడ నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌వే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో జంటలు కూడా వేర్వేరుగా నిద్రించాలని.. ముద్దులు, కౌగిలింతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా వైరస్‌ కట్టడికి కఠిన ఆంక్షల అమలుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షాంఘైవాసులు ప్రభుత్వం తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల బయటకు రావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మార్చి తొలివారంలో మొదలైన కొవిడ్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు అక్కడ 1,14,000 కేసులు నమోదయ్యాయి. ఒకే నెలలో ఇన్ని కేసులు నమోదుకావడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి. వైరస్‌ కట్టడి చేసేందుకు భారీ స్థాయిలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా చైనా మిలటరీ వైద్య సిబ్బందిని కూడా రంగంలోకి దింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని