China: చైనాకు కరోనా తిప్పలు.. మరోసారి వైరస్ విజృంభణ..!

కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలుపెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి.

Published : 07 Jul 2022 02:06 IST

బీజింగ్: కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలుపెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. బుధవారం జియాన్, షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్‌డౌన్‌ల గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నుంచి రేషన్ అందిందని షాంఘై ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. 

తాజా విజృంభణ నేపథ్యంలో షాంఘై, బీజింగ్ నగరాల్లో మాస్‌ టెస్టింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. 13 మిలియన్లు జనాభా కలిగిన జియాన్ నగరం గతేడాదిలో నెల రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. చెత్తను రీసైక్లింగ్ చేసే సిబ్బందిలో కేసులు బయటపడటంతో తాత్కాలిక నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. దాంతో బుధవారం అర్ధరాత్రి నుంచి పబ్స్‌, బార్లు, ఇంటర్నెట్ కేఫ్‌లు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క మంగళవారం అర్ధరాత్రి వరకు జియాన్ ప్రజలు నిర్ధారణ పరీక్షల కోసం క్యూ లైన్లో నిల్చొన్న చిత్రాలను అక్కడి మీడియా సంస్థ విడుదల చేసింది. కానీ, ఆ నగరం లాక్‌డౌన్‌లో లేదంటూ నొక్కి చెప్పింది. 

ప్రస్తుతం ఉద్ధృతికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.5.2 కారణమని అధికారులు వెల్లడించారు. దానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక శక్తిని దాటవేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే కొవిడ్ జీరో వ్యూహంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న చైనా, అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు ప్రస్తుత విజృంభణ సరికొత్త సవాలు విసురుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా అధ్యక్షుడు తన వ్యూహానికి కట్టుబడే ఉండి, కఠిన ఆంక్షలకు వెనుకాడటం లేదు. జపాన్‌ బ్యాంకు నోమురా అంచనాల ప్రకారం.. సోమవారం నుంచి దాదాపు 114.8 మిలియన్ల ప్రజలు లాక్‌డౌన్‌ లేక పాక్షిక లాక్‌డౌన్‌లో ఉన్నారని వెల్లడించింది. గత వారం ఆ సంఖ్య 66.7 మిలియన్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని