China Lockdown: చైనాలో కరోనా ఉద్ధృతి.. 2.6కోట్ల జనాభాగల నగరం లాక్‌డౌన్‌లోకి..!

చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.

Published : 29 Mar 2022 02:22 IST

డైనమిక్‌ జీరో కొవిడ్‌ వ్యూహంతో వైరస్‌ కట్టడికి ప్రయత్నం

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి అదుపులోనే ఉన్నప్పటికీ చైనాలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్‌డౌన్‌లోకి జారుకుంది. దీంతో 2.6కోట్ల జనాభా కలిగిన నగరంలో పౌరులందరికీ కొవిడ్‌ పరీక్షలను చేపడుతున్నారు. అయితే, చైనాలో ఇంతపెద్ద నగరంలో కొవిడ్‌ ఆంక్షలు అమలు చేయడం ఇదే తొలిసారి.

షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే 3450 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ఇక్కడే రికార్డయ్యాయి. వీటిలో అత్యధికం లక్షణాలు లేనివే ఉన్నాయని. కేవలం 50 మందిలోనే కొవిడ్‌ లక్షణాలు కనిపించాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో దాదాపు రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన షాంఘై నగరంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, ఈ నగరంలో ఒకేసారి కాకుండా రెండు దఫాల్లో ఈ లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

సూపర్‌ మార్కెట్లు ఖాళీ..

నగరంలో కొవిడ్‌ ఆంక్షల దృష్ట్యా అన్ని వాణిజ్య కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజారవాణా మూసివేయాలని షాంఘై అధికారులు ఆదేశించారు. నగరం నుంచి రాకపోకలపైనా ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని.. నిత్యావసర సరుకులు ఇంటికి చేరువలో వదిలి వెళ్లిపోతామన్నారు. ఇలా లాక్‌డౌన్‌ ఆంక్షలు సోమవారం నుంచి మొదలు కానున్నట్లు అధికారులు ప్రకటించగానే షాంఘై ప్రజలు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా నిత్యావసర వస్తువులను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని సూపర్‌ మార్కెట్‌లన్నీ ఆదివారం రోజే ఖాళీ అయిపోయాయి.

ఇదిలాఉంటే, చైనాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిలిన్‌ ప్రావిన్సులో కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 56వేల కేసులు వెలుగు చూశాయి. తాజాగా షాంఘైలో నిత్యం 3వేలకు పైగా కేసులు రావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి పొంచివున్న ముప్పును తగ్గించేందుకే నగరం మొత్తం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని స్థానిక వైద్యాధికారి వూ ఫ్యాన్‌ వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం, ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను రక్షించడంతోపాటు డైనమిక్‌ జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని