Shanghai: వామ్మో చైనా ‘సైలెంట్‌ పీరియడ్‌’..!

జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చైనా నగరం షాంఘై అత్యంత కఠిన ఆంక్షలకు తెరతీసింది. మరికొన్ని రోజుల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో  ప్రజలను ఆహారం కొనుగోళ్లకు, వైద్యశాలలకు వెళ్లేందుకు కూడా

Published : 12 May 2022 02:09 IST

 కఠిన ఆంక్షల దిశగా షాంఘై

ఇంటర్నెట్‌డెస్క్‌: జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చైనాలోని షాంఘై నగరం అత్యంత కఠిన ఆంక్షలకు తెరతీసింది. మరికొన్ని రోజులు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో  ప్రజలను ఆహారం కొనుగోళ్లకు, వైద్యశాలలకు వెళ్లేందుకు కూడా వీధుల్లోకి వచ్చేందుకు అనుమతించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నగరంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో అమలు చేస్తోన్న అత్యంత కఠినమైన ఆంక్షలు ఇవే. నగరంలో ఈ ప్రాంతాల్లో ఆహార సరఫరా సేవలను కూడా నిలిపేయాలని నిర్ణయించింది. వైద్యశాలల్లో కూడా ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే తొలి ప్రాధాన్యమివ్వనుంది. అంతేకాదు.. కొవిడ్‌ సోకిన వ్యక్తుల పొరుగువారు, సన్నిహితులను కూడా గవర్నమెంట్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. 

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొవిడ్‌ ఆంక్షలు విధించి ఏడు వారాలు అవుతోంది. కొవిడ్‌ నిర్దారించిన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో అధికారులు మాత్రం తమ లక్ష్యంగా ఉన్న ‘సొసైటల్‌ జీరో’ను అందుకోలేకపోతున్నారు. క్వారంటీన్‌లో ఉన్న వారిలో తప్ప బయట ఎక్కడా కొత్త కొవిడ్‌ కేసు రాకూడదనేది ‘సొసైటల్‌ జీరో’ లక్ష్యం.  మరోవైపు కఠిన ఆంక్షలను షాంఘై అధికారులు సమర్థించుకొన్నారు. నగరంలోని సగం ప్రాంతాలకు నిబంధనల నుంచి విముక్తి లభించిందని చెబుతున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది నగరంలోని కీలక ప్రాంతాలకు వెళ్లి కలిసి ఫొటోలు దిగిన చిత్రాలను చైనా మీడియా ప్రచారం చేస్తోంది. 

చైనా షాంఘైలో ‘సైలెంట్‌ పీరియడ్‌’ పేరిట కఠిన ఆంక్షలను విధిస్తోంది. దీనిని వచ్చే మూడు రోజులు అమలు చేయనుంది. దీనిలో కేవలం ప్రభుత్వ ఆహార సరఫరాలను మాత్రమే అనుమతిస్తారు. స్థానికులు ఎవరూ గడపదాటి బయటకు రాకూడదు.. అంతేకాదు ఎమర్జెన్సీ కేసులు కాకుండా ఎవరైనా వైద్యశాలలకు వెళ్లాలంటే కమిటీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి.

కొవిడ్‌ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని బలవంతంగా సెంట్రల్‌ క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇళ్లను డిస్‌ఇన్ఫెక్ట్‌  చేయడానికి ఇంటి తాళాలను తలుపుల వద్ద ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై స్థానికుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌ పోస్టులు చేసినా.. ఆ తర్వాత వాటిని తొలగిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని