Shanghai Lockdown: ఊపిరి పీల్చుకుంటోన్న షాంఘై.. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు

గత ఆరు వారాలుగా ఆంక్షల గుప్పిట్లో ఉండిపోయిన షాంఘై నగరంలో కరోనా ఉద్ధృతి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 16 May 2022 22:21 IST

జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో ఎత్తివేత

షాంఘై: కరోనా వైరస్‌ విజృంభణతో చైనా ఆర్థిక నగరం షాంఘై వణికిపోయిన సంగతి తెలిసిందే. వైరస్‌ కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఆహారం, నిత్యావసరాల కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. దాదాపు ఆరు వారాలుగా ఆంక్షల గుప్పిట్లో ఉండిపోయిన షాంఘై నగరంలో కరోనా ఉద్ధృతి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నేటి నుంచి పలు జిల్లాల్లో ఆంక్షలను సడలించిన అధికారులు.. జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృత వ్యాప్తితో రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘై నగరం మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నా కొద్ది ఆంక్షలను పొడగిస్తూ వస్తోంది. అయితే, కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యలతో వైరస్‌ విజృంభణ తగ్గినట్లు షాంఘై అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఆంక్షలను సడలించామన్న నగర మేయర్‌.. ప్రస్తుతం 10లక్షల మంది మాత్రమే కఠిన లాక్‌డౌన్‌లో ఉన్నారని వెల్లడించారు. దీంతో జూన్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

గత ఆరు వారాలుగా పూర్తి లాక్‌డౌన్‌లో కొనసాగిన షాంఘైలో సోమవారం నుంచి సూపర్‌ మార్కెట్‌లు, మాల్స్‌, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించారు. అయితే, రైలు సబ్‌వేలను పూర్తిగా మూసినవేసిన అధికారులు.. ఇతర ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరి చేశారు. ఇలా గత యాభై రోజులుగా ఇళ్లకే పరిమితమైన షాంఘైవాసులకు ఆంక్షల నుంచి బయటపడేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలాఉంటే, చైనాలో సోమవారం నాడు కొత్తగా 1159 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా షాంఘైలోనే వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. అటు రాజధాని బీజింగ్‌లోనూ నిత్యం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం రోజున 54 కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోనా నిర్ధారణయైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేయడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని