Suez Canal: సూయజ్‌కాల్వలో హడలెత్తించిన భారీ నౌక..!

సూయజ్‌ కెనాల్‌లో ఓ భారీ నౌక ప్రపంచాన్ని కొద్దిసేపు టెన్షన్‌కు గురిచేసింది. కాల్వ మధ్యలో ఒరిగిపోవడంతో మళ్లీ ప్రపంచ జలరవాణ సంక్షోభంలో పడుతుందని భయాలురేగాయి. 

Published : 10 Jan 2023 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి వంటి సూయజ్‌ కాల్వలో ఓ భారీ నౌక కొద్దిసేపు ఒరిగిపోయి టెన్షన్‌ పుట్టించింది. ఈ విషయాన్ని సూయజ్‌ కెనాల్‌ నిర్వహించే లెత్‌ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన సూయజ్‌ ప్రావిన్స్‌లోని క్వాంటరా పట్టణం వద్ద చోటు చేసుకొంది. ఉక్రెయిన్‌ నుంచి మొక్కజొన్న లోడ్‌తో చైనాకు వెళుతున్న ఎం.వి.గ్లోరి అనే బల్క్‌ క్యారియర్‌ నౌక సోమవారం ఒరిగిపోయింది. దీనిలో దాదాపు 65,000 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న ఉంది. కానీ, కొద్దిసేపటికే ఇది తిరిగి తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ నౌక ఒరిగిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్యాకింగ్‌ చేయడానికి అవకాశం లేని ధాన్యం వంటి సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించే వాటిని బల్క్‌ క్యారియర్లుగా పేర్కొంటారు. 

ఎం.వి. గ్లోరి ఒరిగిపోవడంతో కెనాల్‌లో దాదాపు 20 నౌకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై సూయజ్‌ కెనాల్‌ అథారిటీ నేరుగా స్పందించ లేదు. అయితే, నౌకా రవాణ త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొంటుందని మాత్రం వెల్లడించింది. గ్లోరీ నౌక 225 మీటర్ల పొడవు ఉంటుందని గ్రీక్‌ ఆపరేటర్‌ ‘టార్గెట్‌ మెరైన ఎస్‌ఏ’ వెబ్‌సైట్‌ పేర్కొంది. సూయజ్‌ కాల్వ వెడల్పు 300 మీటర్లు. 2021 మార్చిలో సూయజ్‌ కాలువలో 400 మీటర్ల పొడవైన ఎవర్‌ గివెన్‌ అనే భారీ సరకు రవాణా నౌక అడ్డం తిరిగింది. దాంతో ఆ మార్గంలో కొన్ని రోజులపాటు రవాణా ఆగిపోయింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రోజుకు దాదాపు రూ.70 వేల కోట్ల వ్యాపారం నిలిచిపోయినట్లు అంచనా వేశారు. దాదాపు వారంరోజుల పాటు శ్రమించి ఈ నౌకను కాలువకు అడ్డు తప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని