Viral Photo: గజరాజు ‘కష్టం’ కన్పించేనా.. హృదయాల్ని మెలిపెడుతున్న ఏనుగు ఫొటో..!
భారీ కాయంతో కన్పించే ఏనుగులు (Elephants) ఎంతటి బరువునైనా మోయగలవు అనుకుంటే పొరబాటే. ఏళ్ల తరబడి అంబారీ మోసే గజరాజులు ఎంత వేదన అనుభవిస్తాయో తెలియాలంటే ఈ చిత్రం చూడండి..!
ఇంటర్నెట్ డెస్క్: అంబారీ ఎక్కడమంటే అందరికీ సంబరమే. కానీ బరువుల్ని మోసే ఆ మూగజీవి వేదన గురించి ఎప్పుడైనా ఆలోచించామా..?అలాంటి కష్టాన్నే ఏళ్లతరబడి అనుభవించిన ఓ గజరాజు (Elephant) పరిస్థితి ఇది. సాధారణంగా ఏనుగు అనగానే భారీ శరీరంతో బలంగా కన్పించే జీవే మనకు గుర్తొస్తుంది. ఇదీ అలాంటిదే. కానీ తన జీవితకాలమంతా పర్యాటకులకు మోసి మోసి ఇలా కృశించుకుపోయింది. మూగజీవుల పట్ల కొందరు మనుషుల అమానుష ప్రవర్తనకు అద్దం పట్టే చిత్రమిది..!
థాయ్‌లాండ్ (Thailand)కు చెందిన ఈ ఆడ ఏనుగు పేరు పై లిన్. 71 ఏళ్ల వయసున్న ఈ ఏనుగు.. 25 ఏళ్లుగా పర్యాటక శాఖలో పనిచేసింది. ట్రెక్కింగ్ విభాగంలో పనిచేసిన ఈ లిన్.. ఏళ్ల తరబడి పర్యాటకులను మోయడంతో ఇలా నిర్వికారంగా మారిపోయింది. ఒక్కోసారి ఈ ఏనుగుపై ఆరుగురు టూరిస్టులను ఒకేసారి ఎక్కించి తిప్పేవారట. ఈ ఏనుగు ఫొటోను వైల్డ్‌లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఇన్ థాయ్‌లాండ్ (WFFT) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఏనుగుల పరిస్థితిని వివరించింది.
‘‘భారీ కాయంతో కన్పించే ఏనుగులు (Elephants) ఎంతటి బరువునైనా మోయగలవు అనుకుంటే పొరబాటే. వాటి వెన్నెముక.. అధిక బరువులను మోసేందుకు అనువుగా ఉండదు. అలాంటిది వాటిపై నిరంతరం పర్యాటకులకు ఎక్కించడం వల్ల వాటి శరీరానికి శాశ్వత నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఎప్పుడూ ఏనుగు అంబారీ ఎక్కొద్దు. ఈ సందేశాన్ని అందరికీ చేర్చండి’’ అని WFFT రాసుకొచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే ఈ సంస్థ ఇలాంటి ఎన్నో మూగజీవాలను కాపాడి తమ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అందులో పై లిన్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఏనుగు తమ కేంద్రంలో స్వేచ్ఛగా విహరిస్తోందని WFFT వెల్లడించింది.
ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బక్కచిక్కిపోయిన పై లిన్ ఫొటో చూసి ఎంతోమంది హృదయాలు ద్రవిస్తున్నాయి. ఇలాంటి కీలక విషయాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు పలువురు నెటిజన్లు WFFT సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మూగజీవుల పట్ల ఇలాంటి క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని.. టూరిస్టు రైడ్లపై నిషేధం విధించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?