USA: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తుపాకీ.. ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెనెస్సీలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. 

Published : 27 Mar 2023 23:55 IST

అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెనెస్సీ నాష్‌విల్లేలో ఉన్న ఓ ప్రైవేట్‌ క్రిస్టియన్‌ పాఠశాలలో ఓ సాయుధ యువతి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. తుపాకీ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో సదరు టీనేజ్‌ యువతి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10.13 గంటలకు చోటుచేసుకుంది. కాల్పులు విషయం తెలియగానే పోలీసులు ఆ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకుని బాధితులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది ఒకరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన యువతి నుంచి రెండు రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితురాలు ఎవరో ఇంతవరకు గుర్తించలేదు. ఈ ఘటన జరిగిన కొవెనంట్‌ ప్రీ-స్కూల్‌లో ఉన్న విద్యార్థులందరూ 12 ఏళ్లలోపు వారే. ఈ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని