US: మిచిగాన్‌ యూనివర్సిటీలో కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికా (US)లోని మిచిగాన్‌ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 14 Feb 2023 13:08 IST

వాషింగ్టన్‌: అగ్రరాజం అమెరికా (US) మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు.

అమెరికా (America) కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు యూనివర్సిటీలోకి చొరబడ్డాడు. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించారు. మరో పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అమెరికా (US)లో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ (Michigan State University) ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్‌ లాన్సింగ్‌ క్యాంపస్‌లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని