Buckingham: పట్టాభిషేకానికి ముందు.. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వద్ద తూటాల కలకలం

 బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకం మరో నాలుగు రోజుల్లో జరగనుండగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోకి ఓ దుండగుడు తూటాలు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Updated : 03 May 2023 12:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లండన్‌ (London)లోని బకింగ్‌హామ్‌ (Buckingham) ప్యాలెస్‌లో మంగళవారం ఓ దుండగుడు కలకలం సృష్టించాడు. ప్యాలెస్‌లోకి తూటాలను విసిరాడు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేకానికి నాలుగు రోజులు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్యాలెస్‌ సమీపంలోని రహదారులను కొద్దిసేపు మూసివేశారు. ప్యాలెస్‌ చుట్టుపక్కల గస్తీ పెంచారు. ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్యాలెస్‌లో నిందితుడు కాల్పులు జరపలేదని, అధికారులు, ప్రజలు ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అతడి వద్ద అనుమానాస్పదంగా ఒక బ్యాగ్, కత్తి ఉన్నట్లు  వెల్లడించారు. అయితే ఘటనా సమయంలో రాజు ఛార్లెస్‌, ఆయన భార్య కెమిల్లా ప్యాలెస్‌లో లేరని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని త్వరగా పట్టుకున్నారని, అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు మెట్రో పోలీస్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ జోసెఫ్‌ మెక్‌డొనాల్డ్‌ తెలిపారు.

బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో మే 6వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు పలు దేశాల అధినేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు. పట్టాభిషేక వేడుకల్లో భాగంగా మే 7న విండ్సర్‌ కళాశాలలో సంగీత కచేరీ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంగీత కళాకారులు ఈ కచేరీలో పాల్గొంటారు. రాజు ఊరేగింపు ప్యాలెస్‌ మైదానంలో ప్రారంభమై లండన్‌ వీధుల్లో అబే వైపు కొనసాగుతుందని మెట్‌ పోలీసులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు మే 8న ముగుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని