China: జననాల క్షీణత ఎఫెక్ట్‌.. అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు..!

జననాలు తగ్గిపోతుండటంపై చైనా(China) ఆందోళనకు గురవుతోంది. దాంతో జనాభా పెంపుపై అక్కడి అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

Published : 30 Jan 2023 18:30 IST

బీజింగ్‌: చైనా(China) జనాభా తగ్గుదల కలరపెడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్‌ ఆశలకు ఈ పరిస్థితి గండికొట్టేలా కనిపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సిచువాన్‌(Sichuan) ప్రావిన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కలిగి ఉండొచ్చని, వివాహితులు పొందే ప్రయోజనాలు పొందడానికి ఆ ప్రావిన్స్‌ అనుమతించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం ఒకటి వెల్లడించింది. 

గతంలో ఉన్న నిబంధన ప్రకారం వివాహితులు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన సడలించనున్నారని తెలిపింది. వివాహం కాని ఒంటరి వ్యక్తి పిల్లలు కావాలనుకుంటే ఆ నిబంధన కింద ఫిబ్రవరి 15 నుంచి అనుమతి లభిస్తుంది. అందుకు సిచువాన్ అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అంతేగాకుండా పిల్లల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి పరిమితి ఉండబోదట. దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన జనాభా అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సిచువాన్ ఆరోగ్య కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ ఇద్దరు పిల్లలు కావాలనుకున్న పెళ్లైన జంట మాత్రమే కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు వారితో పాటు పెళ్లికాని వారికీ వెసులుబాటు కల్పించింది. 

ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారి చైనా జనాభా తగ్గింది. మరణాల కంటే జననాల రేటు తక్కువగా నమోదైంది. వృద్ధాప్యంలో ఉన్నవారి సంఖ్య పెరగడం, జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ఈ తరహా వెసులుబాట్ల వైపు అక్కడి ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. పెళ్లయిన వారికి ఇచ్చే ప్రయోజనాలను వీరికి అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని