Canada: నో ఫ్లై జాబితాలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు.. భారత్‌తో విభేదాల వేళ కెనడా కోర్టు తీర్పు

ఖలిస్థానీ అంశంలో మన దేశంతో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతోన్న తరుణంలో కెనడా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  

Updated : 21 Jun 2024 17:07 IST

ఒట్టావా: తమను నో ఫ్లై జాబితా నుంచి తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడా (Canada)లోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. ఉగ్రవాద చర్యకు పాల్పడొచ్చని విశ్వసించేందుకు సహేతుకమైన కారణాలున్నాయని వ్యాఖ్యానిస్తూ వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. పాకిస్థాన్‌ మద్దతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు పర్వాకర్‌ సింగ్ దులై అలియాస్ పార్రీ దులై, భగత్ సింగ్ బ్రార్ గత కొన్నేళ్ల నుంచి నో ఫ్లై జాబితాలో ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కెనడా ప్రభుత్వం వారిని ఆ జాబితాలో చేర్చింది. ఆ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. పార్రీ దులై .. కెనడాలోని సర్రే ప్రాంతంలో ఛానెల్‌ పంజాబీ, చండీగఢ్‌లో ‘గ్లోబల్ టీవీ’ ని నిర్వహిస్తున్నారు. బ్రార్‌.. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ సానుభూతిపరుడు లఖ్బీర్‌ సింగ్ రొడె కుమారుడు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఆజ్యం పోస్తూ.. నిజ్జర్ హత్య జరిగి ఏడాదైన సందర్భంగా ఇటీవల ట్రూడో సర్కార్ తమ పార్లమెంట్‌లో నివాళులర్పించింది. ఏకంగా ఆ దేశ పార్లమెంట్‌లో ఈ సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి పరిణామాల మధ్య పాక్‌ మద్దతున్న ఇద్దరు ఖలిస్థానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని