Singapore: నాగేంద్రన్‌ ధర్మలింగంకు ఉరి.. ఫలించని సుదీర్ఘ న్యాయపోరాటం

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నాగేంద్రన్ కె.ధర్మలింగం(34)ను సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది.......

Updated : 27 Apr 2022 16:59 IST

దిల్లీ: ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని ఆ భారత సంతతి వ్యక్తి 11 ఏళ్లుగా చేసిన న్యాయపోరాటం ఫలితం లేకుండా పోయింది. క్షమాభిక్ష ప్రసాదించాలని అంతర్జాతీయ సమాజం ప్రాధేయపడినా సింగపుర్‌ కనికరించలేదు. మానసిక స్థితి సరిగా లేని తన బిడ్డను ఉరితీయొద్దని జడ్జిల ముందు తల్లి కన్నీరుమున్నీరైనా న్యాయస్థానం ఆలకించలేదు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నాగేంద్రన్ కె.ధర్మలింగం(34)ను సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది.

సింగపూర్‌లో నివసించే నాగేంద్రన్.. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో 2009లో అరెస్టయ్యాడు. దోషిగా తేలిన అతనికి 2010లో అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే మానసిక సమస్యలతో బాధపడే నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దుచేయాలంటూ మానవ హక్కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. చిన్నపాటి ఉద్యమమే సాగింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ సమాజం దృష్టినీ ఆకర్షించింది. తన ప్రియురాలిని చంపేస్తామని బెదిరించిన కొందరు నాగేంద్రన్​తో బలవంతంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయించారని.. అందువల్ల దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని మానవహక్కుల కార్యకర్తలు కోర్టును అభ్యర్థించారు.

నాగేంద్రన్​ ఉరిశిక్ష రద్దు కోరుతూ గతేడాది అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా ప్రారంభమైన ఓ పిటిషన్​పై 56,134 మంది సంతకాలు చేశారు. ధర్మలింగం ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. అతని ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించింది.

పలు పిటిషన్లు.. తిరస్కరణలు

42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. తనపై మోపిన నేరారోపణలను కొట్టేయాలంటూ అతడు కోర్టును ఆశ్రయించగా 2011 సెప్టెంబర్​లో అప్పీల్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగారశిక్ష విధించాలని 2015లో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ దరఖాస్తును హైకోర్టు 2017లో కొట్టివేసింది. 2019లో చేసుకున్న మరో అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. చివరిగా క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ సైతం తిరస్కరణకు గురైంది.

కరోనాతో ఆలస్యం

గతేడాది నవంబర్​ 10నే నాగేంద్రన్​ను ఉరి తీయాల్సి ఉంది. అయితే అతను కరోనా బారినపడటంతో ఆలస్యమైంది. ఆ తర్వాత అతను ఉన్నత కోర్టులను ఆశ్రయించడం, దానిపై విచారణలు జరగడం వల్ల శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. సోమవారం కూడా ఓ పిటిషన్ దాఖలు అయినప్పటికీ.. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు పిటిషన్​ను స్వీకరించలేమని, చాలా ఆలస్యమైందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాగేంద్రన్​కు బుధవారం ఉరిశిక్ష అమలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని