Vaccination: మోడెర్నా భేష్‌.. చైనా వ్యాక్సిన్‌ తుస్‌స్‌..?

గతేడాది సింగపూర్‌లో నమోదైన కొవిడ్‌ మరణాల్లో దాదాపు 30శాతం మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నవారేనని తేలింది.

Updated : 10 Jan 2022 18:17 IST

సింగపూర్‌ కొవిడ్‌ మరణాల్లో 30శాతం టీకా తీసుకున్న వారిలోనే

సింగపూర్‌: కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముమ్మరంగా చేపడుతున్నాయి. దీంతో కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు మరణాలు, ఆస్పత్రి చేరికలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్‌ కూడా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందిన మోడెర్నా, ఫైజర్‌తోపాటు మరో రెండు చైనా వ్యాక్సిన్‌లనూ పంపిణీ చేస్తోంది. అయితే, గతేడాది సింగపూర్‌లో నమోదైన కొవిడ్‌ మరణాల్లో దాదాపు 30శాతం మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నవారేనని తేలింది. ముఖ్యంగా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక కానటువంటి చైనా వ్యాక్సిన్‌లు తీసుకున్న వారిలోనే మరణాలు అధికంగా నమోదైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని సింగపూర్‌ ఆరోగ్యశాఖ మంత్రి అంగ్‌ యే కుంగ్‌ అక్కడి పార్లమెంటులో వెల్లడించారు.

మరణాల నిరోధంలో మోడెర్నా భేష్‌..

వైరస్‌ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సింగపూర్‌ వేగంగా చేపడుతోంది. ఇప్పటికే బూస్టర్‌డోసు పంపిణీని మొదలుపెట్టింది. అయితే, కరోనా వైరస్‌ కారణంగా అక్కడ గతేడాది 802 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 247 మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారేనని వెల్లడైంది. ముఖ్యంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే చైనా వ్యాక్సిన్‌లు తీసుకున్న వారిలోనే కొవిడ్‌ మరణాలు అధికంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా చైనాకు చెందిన సినోవాక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి లక్ష మందిలో 11 మరణాలు సంభవించగా.. మరో చైనా వ్యాక్సిన్‌ సినోఫామ్‌ తీసుకున్న ప్రతి లక్ష మందిలో మరణాల రేటు 7.8గా నమోదైంది. అదే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లైన ఫైజర్‌ తీసుకున్న వారిలో 6.2 ఉండగా.. మోడెర్నా తీసుకున్న లక్ష మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు రుజువైంది. ఇలా మొత్తంగా కొవిడ్‌తో మృతి చెందిన వారిలో 30శాతం వ్యాక్సిన్‌ తీసుకున్న వారేనని అక్కడి అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. మోడెర్నాతో పోలిస్తే చైనా వ్యాక్సిన్‌లు తీసుకున్న వారిలోనే కొవిడ్‌ మరణాలు అధికంగా ఉండడం పరిశీలించాల్సిన విషయమేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు సింగపూర్‌లో మొత్తం 838 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోగా వారిలో 802 మంది గతేడాది (2021లో) మృత్యువాతపడ్డారు. వారిలో 555 మంది బాధితులు వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉన్నారు. కేవలం 247 మరణాలను విశ్లేషణ ఆధారంగా తాజా అంచనాలకు వచ్చామని.. ఇవి కేవలం సూచిక మాత్రమేనని సింగపూర్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 12ఏళ్ల వయసుపైబడిన వారిలో 95శాతం మందికి వ్యాక్సిన్‌ అందించగా.. ఐదు నుంచి 11ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించామని పేర్కొంది. వీటితోపాటు దాదాపు 46శాతం అర్హులకు బూస్టర్‌ డోసును పంపిణీ చేశామని తెలిపింది. అయితే, సింగపూర్‌లో గతేడాది డెల్టా వేరియంట్‌ ప్రాబల్యమే అధికంగా ఉండగా.. తాజాగా ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సింగపూర్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని