Nuclear Weapons: 2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక

Nuclear Weapons: ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల అభివృద్ధి పెరుగుతోందని సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని పేర్కొంది.

Published : 17 Jun 2024 09:45 IST

Nuclear Weapons | స్టాక్‌హోమ్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే (Nuclear Weapons) నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధోసంస్థ ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (SIPRI)’ వెల్లడించింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. ఈమేరకు వార్షిక ‘సిప్రి ఇయర్‌ బుక్‌ 2024’ను సోమవారం విడుదల చేసింది.

అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది. కొన్ని దేశాలు 2023లో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచాయని పేర్కొంది. మొత్తంగా 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఇవన్నీ వినియోగానికి అందుబాటులో ఉన్నట్లే. దాదాపు 3,904 అస్త్రాలు క్షిపణులు, యుద్ధ విమానాల్లో అమర్చి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 60 వరకు పెరిగింది. వీటిలో దాదాపు 2,100 ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా అత్యంత అప్రమత్తతతో ఉంచినట్లు నివేదిక స్పష్టం చేసింది. అవన్నీ రష్యా, అమెరికాకు చెందినవేనని తెలిపింది. తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచడం గమనించామని పేర్కొంది.

ఉక్రెయిన్‌ సమగ్రతను గౌరవించాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో 90 శాతం రష్యా, అమెరికాకు చెందినవేనని సిప్రి నివేదిక వెల్లడించింది. 2023లో ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని స్పష్టం చేసింది. అయితే, రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటోందని సిప్రి కీలక అధికారి హాన్స్‌ క్రిస్టెన్‌సెన్‌ తెలిపారు. ఆ దేశం వద్ద 2023లో 410 ఆయుధాలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 500 వరకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకుంటుందని అంచనా వేశారు.

గత ఏడాదిలో భారత్‌ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్లు సిప్రి తెలిపింది. భారత్‌, పాకిస్థాన్‌ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొంది. పాక్‌ ప్రధానంగా భారత్‌ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. భారత్‌ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని పేర్కొంది.

హమాస్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునికీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. డిమోనాలో ఉన్న ప్లుటోనియం ఆధారిత రియాక్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ ఎప్పుడూ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.

వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్య..

  • అమెరికా - 5,044
  • రష్యా - 5,580
  • యూకే - 225
  • ఫ్రాన్స్‌ - 290
  • చైనా - 500
  • భారత్‌ - 172
  • పాకిస్థాన్‌ - 170
  • ఉత్తర కొరియా - 50
  • ఇజ్రాయెల్‌ - 90
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు