Sri Lanka Crisis: శ్రీలంకలో సైన్యం Vs పోలీసులు.. అత్యవసర పరిస్థితి ఎత్తవేత

భారీ ఆర్థిక పతనాన్ని చవిచూస్తున్న శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి....

Updated : 06 Apr 2022 12:20 IST

కొలంబో: భారీ ఆర్థిక పతనాన్ని చవిచూస్తోన్న శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మంగళవారం ఏకంగా సైన్యం, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు, మహిళలు సహా భారీ ఎత్తున ప్రజలు మంగళవారం పార్లమెంటు ఎదుట నిరసనకు దిగారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ బేఖాతరు చేసి ప్రజలు ఆందోళనలు కొనసాగించారు. వారిని అదుపు చేసేందుకు ఓ సైనిక బృందం మాస్కులు ధరించి ఆ ప్రాంతానికి చేరుకుంది. వీరిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండడంతో సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని ఆపేందుకు పోలీసులు వారి వెంటపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అప్రమత్తమైన ఆర్మీ చీఫ్‌ శవేంద్ర సిల్వ ఘటనపై విచారణకు ఆదేశించారు.

అయితే, సైనికులు తుపాకులతో అక్కడికి రావడం వల్లే పోలీసులు వారిని అడ్డుకున్నారని సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్‌లు పెట్టారు. ఆందోళనకారులపై సైన్యం దాడికి దిగితే పరిస్థితి మరింత విషమిస్తుందని భావించే పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో ఇతర పరిణామాలు..

  1. శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటక వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి శ్రీలంకలో అత్యసవర పరిస్థితి విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి అధ్యక్షుడు ప్రకటించారు.
  2. పలువురు చట్టసభ్యులు అధికార కూటమిని వీడారు. దీంతో రాజపక్స సర్కారు మైనార్టీలోకి వెళ్లింది. ప్రభుత్వం మాత్రం తమకు పూర్తి మెజార్టీ ఉన్నట్టు చెబుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పావులు కదుపుతున్నారు. మంత్రుల రాజీనామాల క్రమంలో ఆయన..అధికార ఎస్‌ఎల్‌పీపీ కూటమిలో కలహాలకు కేంద్ర బిందువుగా ఉన్నారని తన సోదరుడైన బాసిల్‌ రాజపక్సను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
  3. బసిల్‌ స్థానంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీ సర్బీని నియమించారు. అయితే, ఆయన 24 గంటలైనా తిరక్కముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రుణంపై చర్చించడానికి ముందే ఆయన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. 
  4. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సూచనలేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వంలో మంత్రులుగా చేరాలన్న అధ్యక్షుడు గొటబాయ పిలుపును ప్రతిపక్షాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. 
  5. శ్రీలంకలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఐరాస మానవ హక్కుల మండలి తెలిపింది. ఇప్పటికే శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ఐరాస ఆంక్షలు ఎదుర్కొంటోంది. 
  6. ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశాల్లో దౌత్యకార్యాయాల నిర్వహణను సైతం చేపట్టలేకపోతోంది. దీంతో నార్వే, ఇరాక్‌, సిడ్నీలోని తమ రాయబార కార్యాలయాలను మూసివేసింది.
  7. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాలను దగ్గరి నుంచి గమనిస్తున్నామని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ప్రజల ఆందోళనలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది.
  8. తన ప్రభుత్వ చర్యలను గొటబాయ సమర్థించుకున్నారు. కొవిడ్‌ కారణంగా పర్యాటకం నిలిచిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.
  9. ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం వెళ్లనున్నాయి. శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌.. తక్షణం బియ్యం పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఇందులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్‌ తదితర పోర్టుల నుంచి బియ్యం శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం రెండు వేల మెట్రిక్‌ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని