North Korea: అనూహ్యంగా జ్వరం వ్యాప్తి.. ఆరుగురు మృతి..!

తన దేశంలో కరోనా మొదటి కేసు గురించి ఉత్తర కొరియా అలా ప్రకటన చేసిందో లేదో అప్పుడే మరణాల లెక్క బయటకు వచ్చింది.

Updated : 14 May 2022 10:30 IST

కొవిడ్‌పై ప్రకటన వెంటనే ఉ.కొరియాలో మరణాలు నమోదు

మొదటిసారి మాస్క్‌లో దర్శనమిచ్చిన కిమ్‌

ప్యాంగ్యాంగ్‌: తన దేశంలో కరోనా మొదటి కేసు గురించి ఉత్తర కొరియా అలా ప్రకటన చేసిందో లేదో అప్పుడే మరణాల లెక్క బయటకు వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరం బారిన పడటంతో ఆరుగురు మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. అనూహ్యంగా జ్వరం వ్యాపించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. మరోపక్క ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ మొదటిసారి మాస్క్‌లో దర్శనమిచ్చారు. 

స్థానిక వార్త సంస్థ లెక్కల ప్రకారం.. 1,87,800 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వారందరూ జ్వరం వల్ల అక్కడ చేరాల్సి వచ్చింది. అయితే అంతమంది అనారోగ్యానికి గురికావడానికి మూలం ఏంటో తెలియాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్ చివరి నుంచి ఈ వ్యాప్తి జరుగుతున్నట్లు చెప్పింది. ఇప్పటివరకూ 3,50,000 మంది జ్వరం బారినపడగా.. 1,62,200 మంది కోలుకున్నారు. ఆరుగురు మృతుల్లో ఒకరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపింది. 

మొదటి సారి మాస్క్ ధరించిన కిమ్‌..

మొదటి కరోనా కేసు గురించి ప్రకటన తర్వాత.. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ మాస్క్ ధరించి కనిపించారు. ఈ రెండేళ్లకాలంలో ప్రపంచమంతా కరోనా వేవ్‌లతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పటినుంచి ప్రతిఒక్కరికీ మాస్కే ప్రధాన రక్షణ కవచంగా నిలిచింది. ఇంతకాలం తమ దేశంలో కరోనా అడుగుపెట్టలేదని గర్వంగా చెప్పిన ఆయన ఎక్కడా మాస్క్‌ పెట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై జరిపిన సమావేశంలో కిమ్‌ సహా అధికారులంతా మాస్కులు పెట్టుకున్నారు. ఇక మహమ్మారి కారణంగా ఆ దేశంలో ఇప్పుడు తీవ్రస్థాయి జాతీయ అత్యయిక స్థితి అమల్లో ఉంది. అతి స్వల్ప కాలంలో కరోనా మూలాన్ని గుర్తించి, దానికి పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని