Pakistan: పాక్‌ ప్రజల నోట ‘చౌకీదార్ చోర్‌ హై’..!

ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పాకిస్థాన్‌ ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ‘చౌకీదార్ చోర్ హై(కాపలాదారు ఒక దొంగ)’ అంటూ నినాదాలు వినిపించాయి.

Updated : 11 Apr 2022 12:05 IST

ఇంతలా జనాలు ఎన్నడూ వీధుల్లోకి రాలేదు: ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పాకిస్థాన్‌ ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ‘చౌకీదార్ చోర్ హై(కాపలాదారు ఒక దొంగ)’ అంటూ నినాదాలు వినిపించాయి. ఆ సమయంలో పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతుండగా.. అక్కడున్న పాకిస్థానీలు ఈ కామెంట్ చేశారు. ఇమ్రాన్‌ను తొలగించడంలో వెనకుండి నడిపించిన పాక్‌ సైన్యాన్ని ఉద్దేశించి ఈ నినాదం చేసినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి నినాదాలు చేయొద్దని, శాంతితో పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈ నెలలో పరిస్థితులు మారతాయని, దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దిగిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. 

భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార భాజపాకు వ్యతిరేకంగా ఈ ‘చౌకిదార్‌ చోర్‌ హై’ నినాదం చేసింది. ఈ విషయంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కార ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆ కేసు విచారణ ముగిసిపోయింది. 

ఇంతలా జనాలు ఎన్నడూ వీధుల్లోకి రాలేదు: ఇమ్రాన్‌

మరోపక్క తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ సోమవారం కృతజ్ఞతలు తెలియజేశారు. ‘అమెరికా మద్దతుతో జరుగుతోన్న పాలన మార్పునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న పాకిస్థాన్‌ పౌరులకు ధన్యవాదాలు. జైలుకు వెళ్లివచ్చిన వారిని అధికారంలోకి తీసుకురావడానికి స్థానికంగా కొందరు సహకరిస్తున్నారు. ఈ తీరును స్వదేశం, విదేశాల్లోని పాకిస్థానీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోసగాళ్ల నేతృత్వంలో దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ..ఈ స్థాయిలో జనాలు ఎప్పుడూ బయటకు రాలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిరసనల వీడియోను షేర్ చేశారు. 

శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ప్రధాని పదవి కోల్పోయారు. తన పదవికి ఎసరు రావడం వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపించిన ఇమ్రాన్.. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. పదవి కోల్పోయిన వెంటనే చేసిన మొదటి ట్వీట్‌లోనూ ఆ రాగమే తీశారు. ‘1947లో పాకిస్థాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ దేశంలో మరోసారి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. ఈ సారి ప్రభుత్వ మార్పుకోసం జరిగిన విదేశీ కుట్రలపై! దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎప్పుడూ ప్రజలే’ అని ట్వీట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని