USA: మంచు తుపాను గుప్పిట అమెరికా.. క్రిస్మస్‌ వేళ వేలాది విమానాలు రద్దు!

మంచు తుపాను ధాటికి అమెరికాలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల తక్కువకు పడిపోయాయి. క్రిస్మస్‌ సంబరాల వేళ ఈ వాతావరణం పౌరులకు ఇబ్బందికరంగా మారింది.

Updated : 23 Dec 2022 12:07 IST

వాషింగ్టన్‌: శీతాకాలపు మంచు తుపానుతో అమెరికా(America) గజగజ వణికిపోతోంది! భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయాయి. క్రిస్మస్‌(Christmas) సమీపిస్తోన్న వేళ పండగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులనూ మూసివేశారు. మధ్య అమెరికాలో లక్షలాది పౌరులకు హిమ తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మిన్నియాపొలిస్, సెయింట్ పాల్‌, న్యూయార్క్‌, షికాగో తదితర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.

మోంటాన, మిన్నెసోటల్లో.. బయటి వాతావరణం చాలా చల్లగా ఉందని, జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం అమెరికన్లకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ‘ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులా కాదు. చాలా తీవ్రమైన పరిస్థితి’ అని విలేకరులతో అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ‘బాంబు సైక్లోన్‌’గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్‌(AccuWeather) సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్.. ఇతర ప్రాంతాల గవర్నర్లతో కలిసి స్థానికంగా ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.

దట్టమైన పొగ మంచుతోపాటు వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నందున.. ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రహదారి ‘ఇంటర్‌స్టేట్‌-90’ని సౌత్ డకోటాలో మూసివేశారు. ఇలా అనేక ఫ్రీవేలను ప్రస్తుతం ప్రయాణించేందుకు అసాధ్యమైన రోడ్లుగా ప్రకటించారు. మరోవైపు.. విమానాలను ట్రాక్‌ చేసే వెబ్‌సైట్‌ ‘ఫ్లైట్‌అవేర్‌’ ప్రకారం అమెరికాలో గురువారం దాదాపు 22 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 5,500 విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా షికాగో నగరంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు