Iran: ఘోరం.. విద్యకు దూరం చేసేందుకే బాలికలపై విషప్రయోగం..!

కొద్దినెలల క్రితం ఇరాన్‌(Iran)లో జరిగిన దారుణం ఒకటి తాజాగా బయటకువచ్చింది. బాలికలను విద్యకు దూరం చేసేందుకు చేసిన ఘోర ప్రయత్నాల గురించి అక్కడి మంత్రి వెల్లడించారు. 

Updated : 27 Feb 2023 11:08 IST

టెహ్రాన్‌: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు(Hijab protest) ఇరాన్‌(Iran)ను కుదిపేశాయి. ఈ సమయంలో ఓ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారి ప్రాణాలను బలితీసుకునే కుట్రలు జరిగాయని తెలిసింది. వారిపై విషప్రయోగం చేసినట్లు ఇరాన్(Iran) మంత్రి ఒకరు వెల్లడించారు. ఆయన్ను ఉటంకిస్తూ.. ఓ మీడియా కథనం వెలువడింది. 

గత ఏడాది నవంబర్‌ నుంచి ఖోమ్‌(Qom), దక్షిణ టెహ్రాన్‌లో వందల మంది విద్యార్థినులకు శ్వాసకోశం విషపూరితమైనట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై తాజాగా ఇరాన్‌ మంత్రి యునెస్‌ పనాహీ స్పందించారు. ఈ విష ప్రయోగం కావాలనే జరిగినట్లు మంత్రి  వ్యాఖ్యానించారు. ‘ఇదంతా బాలికల పాఠశాలలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే’ అని వెల్లడించారు. దీని వెనక ఎవరున్నారు..? అనే విషయాలను మాత్రం ఆయన పేర్కొనలేదు. అలాగే ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోలేదు. 

ఈ విషప్రయోగ ఘటనపై ఫిబ్రవరి 14న బాధితుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా.. దీనికి గల కారణాలను గుర్తిస్తున్నామని ప్రభుత్వం స్పందించింది. గతేడాది సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌(Iran)లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు(Hijab protest) పెల్లుబికాయి. ఈ క్రమంలోనే విషప్రయోగం ఘటన వెలుగులోకి వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని