Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin).. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. 

Published : 30 May 2023 14:56 IST

కేప్‌టౌన్‌: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) నుంచి అరెస్ట్‌ వారెంట్‌ను ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Russian President Vladimir Putin) విషయంలో దక్షిణాఫ్రికా(South Africa) కీలక నిర్ణయం తీసుకుంది. తన దేశంలో పుతిన్‌ను అరెస్టు చేయకుండా దౌత్యపరమైన రక్షణ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో పుతిన్‌తో పాటు ఆ దేశ ప్రతినిధులకు ఈ రక్షణ కల్పించింది.  

గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా(Russia) సైనిక చర్యను ప్రారంభించింది. ఆ దురాక్రమణపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆ దాడిలో భాగంగా ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై మార్చిలో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని అప్పట్లోనే రష్యా తోసిపుచ్చింది.

ఐసీసీ సభ్య దేశంగా.. పుతిన్‌ తమ దేశం వస్తే, దక్షిణాఫ్రికా అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఆ దేశం తాజా ప్రకటన విడుదల చేసింది. ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని, తమ దేశంలో జరిగే అంతర్జాతీయ సమావేశాలకు ఈ తరహా నోటీసులు జారీ చేస్తుంటామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. బ్రిక్స్‌(BRICS)లో  బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా భాగం. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సులకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది. దీనిలో భాగంగా జూన్‌ 1-2 తేదీల్లో కేప్‌టౌన్‌లో బ్రిక్స్‌ మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనుంది. ఆగస్టు 22-24 జొహాన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. దీనికి పుతిన్‌ హాజరవుతారనే వార్తలు చర్చకు దారితీశాయి. ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు. ఐసీసీ సభ్య దేశాల్లో పుతిన్‌ పర్యటించనంతకాలం ఆయన్ను అరెస్టు చేయడం కుదరదని ఇదివరకే పలు నివేదికలు వెల్లడించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు