South Korea: ఆ ఒప్పందం.. విడ్డూరం..! రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా

రష్యా, ఉత్తర కొరియాలు కుదుర్చుకున్న మిలిటరీ ఒప్పందంపై దక్షిణ కొరియా (South Korea) భగ్గుమంది.

Published : 20 Jun 2024 18:54 IST

సియోల్‌: రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా (South Korea) మండిపడింది. ఇది ఐరాస భద్రత మండలి (UNSC) తీర్మానాల ఉల్లంఘనేనని పేర్కొంది. యుద్ధాలు చేయడం, ఆక్రమణలకు పాల్పడటం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు.. ఎప్పటికీ జరగని దాడుల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మాస్కోపై పోరాడేందుకుగాను ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల సరఫరాపైనా ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

‘‘ప్యాంగాంగ్‌కు వ్యతిరేకంగా ఆంక్షల తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్‌ఎస్‌సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం. ఇప్పుడు అదే దేశానికి అండగా నిలవాలని తీసుకున్న నిర్ణయం.. మా భద్రతకు విఘాతం కలిగిస్తుంది. అదే విధంగా మాస్కోతో మా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని సియోల్‌ స్పష్టం చేసింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో కీవ్‌కు మానవతాసాయం అందజేసిన దక్షిణ కొరియా.. నేరుగా ఆయుధాలను మాత్రం సమకూర్చలేదు. యుద్ధంలో ఉన్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయకూడదనే దీర్ఘకాల విధానాన్ని గతంలో ఉటంకించింది. అయితే.. ఇప్పుడు ఈ విషయంలో పునరాలోచన చేస్తామని తెలిపింది.

పుతిన్‌కు కిమ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఏమిటో తెలుసా..?

కిమ్‌ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియాలో పుతిన్‌ రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని ఇరునేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పశ్చిమ దేశాలతో ఈ రెండింటికి ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని