South Korea: కరోనా సోకలేదంటే.. స్నేహితులు లేరేమో..!

ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా.. కొవిడ్ మృతులతో ఖాళీలేని శ్మశాన వాటికలు.. ఈ రెండు మాటలు చాలు దక్షిణకొరియా ఎదుర్కొంటోన్న కరోనా సంక్షోభం గురించి చెప్పడానికి.

Published : 23 Mar 2022 18:15 IST

దక్షిణ కొరియాలో కరోనా విలయం.. ఖాళీలేని శ్మశాన వాటికలు

సియోల్‌: ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా.. కొవిడ్ మృతులతో ఖాళీలేని శ్మశాన వాటికలు.. ఈ రెండు మాటలు చాలు దక్షిణకొరియా ఎదుర్కొంటోన్న కరోనా సంక్షోభం గురించి చెప్పడానికి. ప్రస్తుతం అక్కడి నిత్యం లక్షల్లో కొత్త కేసులొస్తున్నాయి. బుధవారం 4,90,881 మందికి వైరస్‌ సోకినట్లు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. దాంతో మొత్తం కేసులు కోటి దాటేశాయి. 24 గంటల వ్యవధిలో దాదాపు 300 మరణాలు సంభవించినట్లు వరల్డో మీటర్ వెబ్‌సైట్‌ తెలిపింది. 

ప్రస్తుత ఉద్ధృతికి స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కారణమని నిపుణులు చెప్తున్నారు. తాజా విజృంభణలో కనీసం 20 శాతం మంది జనాభాకు వైరస్ సోకిందని వెల్లడించారు. దాంతో 18 లక్షల మంది హోం క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఈ స్థాయిలో తీవ్రత ఉన్నప్పటికీ.. ఇంకా వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోలేదని అంచనా వేశారు. అంటే మున్ముందు కేసులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఇక ఆ దేశంలో 86.6 శాతం మంది జనాభా పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. 63.2 శాతం మందికి బూస్టర్ డోసులు కూడా అందాయి. 

ఇదిలా ఉండగా.. కొరియన్ వ్యాక్సిన్ సొసైటీ ఉపాధ్యక్షుడు మా సాంగ్‌ హ్యుక్ వ్యాఖ్యలు ఆ దేశంలో మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ‘మా దేశంలో ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎవరికైనా కొవిడ్ సోకలేదంటే..బహుశా ఆ వ్యక్తికి స్నేహితులు లేకపోయి ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. మొదట సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు పెట్టిన ఆయన, తర్వాత తొలగించారు. 

గత కొద్దిరోజుల నుంచి రికార్డు స్థాయి మరణాలతో దక్షిణ కొరియా పరిస్థితి దయనీయంగా మారింది. వైరస్‌కు కేంద్ర బిందువైన రాజధాని నగరం సియోల్‌ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబ సభ్యులు అంతిమ కార్యక్రమాల కోసం శ్మశాన వాటికల ముందు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో ఆ దేశంలో 60 శ్మశాన వాటికల్లో ఎక్కువ గంటలు అంతిమ కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాటి సామర్థ్యాన్ని ఒకరోజుకు 1,000 నుంచి 1,400కు పెంచారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని