Pegasus: పెగాసస్‌తో.. ఆ దేశ ప్రధాని ఫోన్‌ హ్యాక్‌..!

పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌.. భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ వ్యవహారం గతేడాది సంచలనం సృష్టించింది. మన దేశంలో రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ఈ స్పైవేర్‌ సాయంతో హ్యాక్‌ చేసినట్లు

Published : 02 May 2022 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌.. భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ వ్యవహారం గతేడాది సంచలనం సృష్టించింది. మన దేశంలో రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ఈ స్పైవేర్‌ సాయంతో హ్యాక్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ స్పైవేర్‌తో స్పెయిన్‌ ప్రధానమంత్రి ఫోన్‌ కూడా హ్యాక్ అయినట్లు తాజాగా బయటపడింది.

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ మొబైల్‌ ఫోన్‌ను గతేడాది పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాక్ చేసినట్లు ఆ దేశ ప్రెసిడెన్సీ మినిస్టర్‌ ఫెలిక్స్‌ బొలాసో సోమవారం ఓ మీడియా కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. మే నెలలో రెండు సార్లు ఫోన్‌ను హ్యాక్‌ చేసినట్లు తెలిపారు. రక్షణ మంత్రి మార్గరిటా రోబెల్స్‌ ఫోన్‌లోనూ స్పైవేర్‌ను జొప్పించినట్లు చెప్పారు. ప్రధాని, రక్షణ  మంత్రి ఫోన్ల నుంచి కీలక వివరాలను తస్కరించారని, ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే స్పెయిన్‌ జాతీయ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘ఇది అక్రమమైన, చట్ట వ్యతిరేక చర్య. బయటి వ్యక్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారు’’ అని ఫెలిక్స్‌ అన్నారు.

ఇదిలా ఉండగా.. స్పెయిన్‌లో ఈ పెగాసస్‌ వ్యవహారం గతంలోనూ కలకలం సృష్టించింది. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో జరిగిన వేర్పాటు ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఫోన్లను 2017 - 2020 మధ్య పెగాసస్‌తో హ్యాక్‌ చేసినట్లు సైబర్‌ నిపుణుల బృందం తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఫెలిక్స్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే ఈ స్పైవేర్‌ సాయంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు గతేడాది సంచలన కథనం వెలువడింది. భారత్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్‌ చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఇది కాస్తా దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ స్పైవేర్‌ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని