Antony Blinken: బాధ్యతారాహిత్య పనులు పునరావృతం కావొద్దు.. చైనాకు హెచ్చరిక!

తమ గగనతలంపై నిఘా బెలూన్‌ పంపడం వంటి బాధ్యతారాహిత్య పనులు మరోసారి చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చైనాను హెచ్చరించారు. చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్‌ యీతో ఆయన తాజాగా సమావేశమయ్యారు.

Published : 19 Feb 2023 11:47 IST

వాషింగ్టన్‌: అమెరికా(America) గగనతలంలో చైనా(China) నిఘా బెలూన్‌ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలను పునరావృతం చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) తాజాగా చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీ(Wang Yi)కి స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలను అమెరికా సహించదని హెచ్చరించారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(Munich Security Conference) సందర్భంగా ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. నిఘా బెలూన్‌(Spy Balloon) వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగిన వేళ.. అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘అమెరికా ప్రాదేశిక గగనతలంలో నిఘా బెలూన్ ద్వారా.. దేశ సార్వభౌమాధికారానికి వాటిల్లిన ముప్పు, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా చైనా ఉల్లంఘనల గురించి బ్లింకెన్‌ నేరుగా మాట్లాడారు. ఈ బాధ్యతారాహిత్య చర్య మరోసారి జరగకూడదని వాంగ్‌ యీకి స్పష్టం చేశారు’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్(Ned Price) చెప్పారు. దీంతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా(Russia) సైనిక చర్య నేపథ్యంలో.. మాస్కోకు సహకారం, ఆంక్షల ఎగవేతలో తోడ్పాటు అందించినట్లయితే ఎదురయ్యే చిక్కులు, పరిణామాల గురించి వాంగ్‌ యీని హెచ్చరించినట్లు ప్రైస్‌ చెప్పారు. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయన్నారు.

మరోవైపు వాంగ్ యీ మాట్లాడుతూ.. బెలూన్‌ వ్యవహారంలో వాషింగ్టన్ స్పందించిన తీరుతో తమ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. స్థానిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా ఇటువంటి పనులు చేయొద్దని పేర్కొన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ బెలూన్‌ ఘటనే బ్లింకెన్ చైనా పర్యటన రద్దుకూ కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని