Srilanka Crisis: పెల్లుబికిన ప్రజాగ్రహం.. శ్రీలంకలో ఎమర్జెన్సీ

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు.

Updated : 22 Nov 2022 14:13 IST

కొలంబో: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వేల సంఖ్యలో నిరసనకారులు కొలంబో వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రధాని రణిల్ విక్రమసింఘే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో.. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు నీటిఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపుతప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(emergency)ప్రకటించింది. రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు. 

ఈ రోజు మధ్యాహ్నం కల్లా రణిల్ దిగిపోవాలి..

గొటబాయ ఈ రోజు రాజీనామా చేయాల్సి ఉండగా.. ఈ తెల్లవారుజామున దేశం దాటి మాల్దీవులకు పారిపోయారు. దాంతో శనివారం తర్వాత నిరసనకారులు మరోసారి తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. పార్లమెంట్‌, ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని కార్యాలయం ముందు భారీఎత్తున్న నిరసనకారులున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు ఆయన నివాస భవనం గోడలు ఎక్కుతున్నట్లు వాటిలో కనిపిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా కొనసాగడాన్ని వారు అంగీకరించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదవిని వీడకపోతే.. తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క కొందరు సైనికులు వారికి సహకరించారు. వారికి నీళ్లు అందించి దాహార్తి తీర్చారు.

మాల్దీవుల్ని వీడనున్న గొటబాయ..

స్వదేశంలో వ్యతిరేకతను దాటుకొని మాల్దీవులకు పలాయనం చిత్తగించారు గొటబాయ రాజపక్స. అయితే ఈ రోజు ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోనున్నారని సమాచారం. ఆ తర్వాత రాజీనామా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మాల్దీవుల ప్రజలు శ్రీలంక వాసులకు తమ మద్దతును ప్రకటించారు.

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌..

ఒకవైపు రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తుంటే.. ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహింద అభయవర్ధన నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయన దేశంలో లేకపోవడంతో ప్రస్తుత నియామకం చోటుచేసుకుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని