Yuan Wang 5: ఆ నిఘా నౌక ప్రయాణాన్ని వాయిదా వేయండి.. చైనాను కోరిన శ్రీలంక

తన నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’.. హంబనటొట నౌకాశ్రయ సందర్శనను వాయిదా వేయాలని శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది. ఇరు దేశాల మధ్య తదుపరి సంప్రదింపులు జరిగే వరకు ఈ...

Published : 07 Aug 2022 01:50 IST

కొలంబో: తన నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’.. హంబనటొట నౌకాశ్రయ సందర్శనను వాయిదా వేయాలని శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది. ఇరు దేశాల మధ్య తదుపరి సంప్రదింపులు జరిగే వరకు ఈ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11న శ్రీలంకలో చైనా లీజుకు తీసుకున్న హంబన్‌టొట ఓడరేవు రావాల్సి ఉంది. అయితే.. తాజాగా శ్రీలంక విదేశాంగ శాఖ ఈ నౌక ప్రవేశానికి అనుమతిని వాయిదా వేసింది. దౌత్య మార్గాల ద్వారా చైనా విదేశాంగ శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా.. ఈ నౌక రాకపై భారత ప్రభుత్వం గత వారం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళనను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి గుణవర్ధన ఇటీవల స్పందిస్తూ.. కేవలం ఇంధనం నింపుకొనేందుకే ఆ నౌక హంబన్‌టొటకు వస్తోంది తప్ప.. ఇతర ప్రయోజనాల కోసం కాదన్నారు. దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు దీని గురించి వివరించినట్లు చెప్పారు. ఈ పరిణామాల నడుమ తాజాగా నౌకా ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనాను కోరడం గమనార్హం. ‘యువాన్‌ వాంగ్‌ 5’.. క్షిపణి, ఉపగ్రహాలను ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా పెట్టగలదు. దీంతో పాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ నౌక విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు