Sri Lanka Crisis: విభేదాలను వీడి సంక్షోభాన్ని ఎదుర్కొందాం: గొటబాయ

రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి సంక్షోభ  నివారణకు కలిసికట్టుగా పోరాడేందుకు ప్రజలను సమాయత్తం చేయాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పిలుపునిచ్చారు...

Published : 01 May 2022 14:00 IST

కొలంబో: రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి సంక్షోభ నివారణకు కలిసికట్టుగా పోరాడేందుకు ప్రజలను సమాయత్తం చేయాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) పిలుపునిచ్చారు. సంక్షోభ (Sri Lanka Crisis) నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సర్కార్‌ వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో గొటబాయ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని ఓ ప్రముఖ బౌద్ధమత గురువు శనివారం డిమాండ్‌ చేశారు. సంక్షోభం (Sri Lanka Crisis)  నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు వీలు కల్పిస్తూ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. లేదంటే, రాజకీయ నాయకులందరినీ తిరస్కరించేలా ప్రజలు ప్రభావితమవుతారని హెచ్చరించారు. ఈ తరుణంలో ప్రజలు, రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని గొటబాయ (Gotabaya Rajapaksa) కార్మికుల దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం గమనార్హం.

1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అతిపెద్ద ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు కనీస నిత్యావసరాలను కూడా దిగుమతి చేసుకోలేని స్థాయికి పడిపోవడంతో సంక్షోభం ప్రారంభమైంది. దీంతో ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చుంది. ఈ సంక్షోభానికి ప్రభుత్వ తప్పిదాలే కారణమని.. నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టడంలోనూ విఫలమైందంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం దేశవ్యాప్తంగా దాదాపు 1000 వ్యాపార సంఘాలు ఒకరోజు ధర్నా నిర్వహించాయి. అధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశాయి. విద్యుత్తు, వైద్య, పోస్టల్‌, ఆరోగ్యం, పోర్ట్స్‌ సహా అన్ని రంగాలకు చెందిన వ్యాపార సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి.

సంక్షోభాని (Sri Lanka Crisis)కి ఎవరు కారణమన్నది పక్కన పెట్టి.. ఈ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలన్నదానిపై దృష్టి సారించాలని గొటబాయ (Gotabaya Rajapaksa) తన కార్మిక దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో దేశంలో అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న సమూహం కార్మిక వర్గమేనని, ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొని దృఢంగా వ్యవహరించి, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు కారణమయ్యారని కొనియాడారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్రమయ్యాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని