Published : 10 Jul 2022 01:32 IST

Sri Lanka Crisis: వీధులన్నీ జనమయం.. అడుగులన్నీ అధ్యక్ష భవనంవైపే! (IN PICS)

కొలంబో: ఆర్థిక సంక్షోభాన్ని(Economic Crisis) నిరసిస్తూ.. శ్రీలంక(Sri lanka) పౌరులు శనివారం చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. స్థానికంగా కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన దరిమిలా వేలాది ఆందోళనకారులు రాజధాని కొలంబో(Colombo) వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ జెండాలతో ఆయన అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు.

అంతకుముందు వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కొలంబో వీధుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను అదుపు చేసేందుకు జలఫిరంగులనూ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అధ్యక్ష అధికారిక నివాసానికి దారితీసే వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు బస్సులు, రైళ్లు, ట్రక్కుల్లో కొలంబోకు చేరుకున్నారు. చాలామంది జాతీయ జెండాలను పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ సమీపంలో పడటంతో.. ఓ వ్యక్తి తన ముఖాన్ని కప్పుకుంటూ కనిపించాడు. మరోవైపు.. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు విసిరిన టియర్ గ్యాస్ షెల్‌ను ఓ వ్యక్తి వెనక్కి విసురుతూ కనిపించాడు.

 

నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శనివారం తన ఇంటి నుంచి పరారైన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల పార్లమెంటులోనూ చేదు అనుభవం ఎదురైంది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారన్న విపక్ష సభ్యుల నినాదాల నడుమ ఆయన మధ్యలోనే పార్లమెంటును వీడారు.

ఈ ద్వీప దేశం కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో.. వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను రెండువారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్‌ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉన్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts