Sri Lanka crisis: శ్రీలంకలో సంక్షోభం.. భారత్‌కు వలసలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. స్వదేశంలో జీవించడమే కష్టంగా మారడంతో అనేక కుటుంబాలు పొట్టచేతపట్టుకొని సమీపంలో ఉన్న భారత్‌కు వలస వస్తున్నాయి........

Published : 10 Apr 2022 17:44 IST

దిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, సామాన్యుడికి అందనంత దూరంలో నిలిచాయి. దీంతో సగటు పౌరుడి జీవనం అగమ్యగోచరంగా మారింది. స్వదేశంలో జీవించడమే కష్టంగా మారడంతో అనేక కుటుంబాలు పొట్టచేతపట్టుకొని సమీపంలో ఉన్న భారత్‌కు వలస వస్తున్నాయి. కొద్దిరోజులుగా ఈ వలసలు కొనసాగుతుండగా.. తాజాగా మరో 19 మంది శ్రీలంక తమిళులు పడవలో తమిళనాడులోని ధనుష్కోడికి చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో నివసించడం చాలా కష్టంగా మారిందని వారు చెప్పుకొచ్చారు. శుక్రవారం ఓ జంట ఇద్దరు పిల్లలతో సముద్రం దాటి భారత తీరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మహిళలు, చిన్నారులు సహా మొత్తం 39 మంది ఆశ్రయం పొందేందుకు భారత తీరానికి చేరుకున్నారు.

ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం కావాలని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సర్బీ వెల్లడించిన విషయం తెలిసిందే. 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందితేనే ఇంధనం, ఔషధాల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయగలమన్నారు. జేపీ మోర్గాన్‌ నివేదిక అంచనాల ప్రకానం.. ఈ ఏడాది లంక స్థూల అప్పులు 7 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముంది. ఇక ద్రవ్యలోటు కూడా 3 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చి నాటికి లంక విదేశీ మారక నిల్వలు 1.93 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

భారత్‌ చేయూత

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న లంకను ఆదుకునేందుకు భారత్‌ ముందుకొచ్చింది. భారత్‌ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ప్రకటించింది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్‌ మరో 1 బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా.. చమురు సాయాన్నీ అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశానికి 2.7లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని