Sri Lanka crisis: శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో శ్రీలంక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. 2.20 కోట్ల జనాభా ఉన్న ద్వీపదేశం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని ఆర్థికసంక్షోభాన్ని..

Updated : 27 Jun 2022 20:12 IST

కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో శ్రీలంక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. 2.20 కోట్ల జనాభా ఉన్న ద్వీపదేశం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ ముఖ్యమైన కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దీంతో లైనల్లోనే పౌరుల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. 

అయితే, ఇంధనం ఆదా చేయడానికి శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసుకోవాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దేశ రాజధాని కొలంబోతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేయాలని, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని చెప్పింది.

మరోవైపు ఇవాళ్టి నుంచి ఇంధన అమ్మకాల్లో పరిమితులు విధించి వినియోగదారులకు టోకెన్లు జారీ చేస్తున్నట్లు శ్రీలంక విద్యుత్‌, ఇంధన శాఖ మంత్రి కంచన విజేసెకెరా వెల్లడించారు. దీంతో తాజాగా బంకుల ముందు ఎదురుచూస్తున్న ప్రజలకు సైనిక బలగాలు టోకెన్లు జారీ చేస్తున్నాయి. టోకెన్‌ నంబర్‌ ఆధారంగా వినియోగదారుల వాహనాల్లో ఇంధనం నింపుతున్నారు. కాగా, అక్కడ ఇంధన ధరలు నిన్న మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై రూ.50, డీజిల్‌పై రూ.60(శ్రీలంకన్‌ రూపాయిలో) పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.470, లీటరు డీజిల్ ధర రూ.460కు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని