Sri Lanka Crisis: లీటర్‌ పెట్రోల్‌ రూ.420, డీజిల్‌ రూ.400

పొరుగున ఉన్న ద్వీపదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Published : 24 May 2022 11:52 IST

కిలోమీటర్‌కు రూ.90 వసూలు చేయనున్న ఆటో డ్రైవర్లు

కొలంబో: పొరుగున ఉన్న ద్వీపదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో మంగళవారం చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. లీటర్ పెట్రోల్‌ ధర 24.3 శాతం మేర పెరిగింది. డీజిల్ ధర 38.4 శాతం అధికమైంది. ఆర్థికంగా ఇక్కట్లు పడుతోన్న ఆ దేశంలో ఏప్రిల్ 19 తర్వాత చేసిన రెండో సవరణ ఇది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.82 పెరగ్గా.. ప్రస్తుతం రూ.420కి లభిస్తోంది. రూ.111 అదనపు భారం పడటంతో.. లీటర్‌ డీజిల్‌కు రూ.400 చెల్లించాల్సి వస్తోంది. ఈ ఇంధన ధరలను పెంచుతూ సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 

సవరించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి వెల్లడించారు. ప్రతి 15 రోజులు లేక నెలకొకసారి ఈ సవరణ ఉంటుందని చెప్పారు. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. సంక్షోభ సమయంలో ప్రజలు పెట్రోల్‌ బంకుల వద్ద క్యూల్లో నిల్చొని ఇబ్బందిపడుతుండగా.. ఈ సవరణ చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఆటో డ్రైవర్లు భారీగా వసూలు చేయనున్నారు. మొదటి కిలోమీటరుకు ప్రయాణికుడి వద్ద రూ.90 తీసుకుంటామని, రెండో కిలోమీటరు నుంచి రూ.80 తీసుకుంటామని వెల్లడించారు. ఇక, ఖర్చు తగ్గింపు విషయంలో కార్యాలయాల అధిపతులకు ప్రభుత్వం విచక్షణాధికారాలు ఇవ్వనుంది. ఉద్యోగుల వ్యక్తిగత హాజరు, ఇంటి నుంచి పనిచేసే విషయంలో వారు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు పేర్కొంది. మరోపక్క, ఈ ఇంధన కొరతను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తోంది.

శ్రీలంక స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొదటిసారి ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్రజలు పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ఇతర నిత్యావసరాల కోసం పొడవైన క్యూల్లో నిల్చోవాల్సివస్తోంది. విద్యుత్‌ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం 40 శాతం దిశగా దూసుకుపోతోంది. ఔషధాల లేమి వ్యాధిగ్రస్తులకు మరణశిక్షలా పరిణమించిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని