Sri Lanka: శ్రీలంకలో ఔషధ ధరల మంట.. తాజాగా మరోసారి పెంపు

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో పౌరులపై తాజాగా మరోసారి అధిక ధరల పిడుగు పడింది! దాదాపు 60 రకాల మందుల ధరలను 40 నుంచి 60 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హృద్రోగులు, మధుమేహులు...

Published : 01 May 2022 01:45 IST

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో పౌరులపై తాజాగా మరోసారి అధిక ధరల పిడుగు పడింది! దాదాపు 60 రకాల మందుల ధరలను 40 నుంచి 60 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హృద్రోగులు, మధుమేహులు వినియోగించే మందులు, యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మాత్రలతోసహా అనేక సాధారణ ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి చన్నా జయసుమన ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు నుంచి రెండింతలు పెరిగిన ఇంధన ధరల ప్రభావాన్ని అధిగమించేందుకు తాజా పెంపుదల అవసరమని సంబంధిత అధికారులు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పెంచిన ధరలను అమలు చేయాలని ఆరోగ్య మంత్రి సంబంధిత సిబ్బందికి సూచించినట్లు ఓ స్థానిక వార్తాసంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆరు వారాల వ్యవధిలో స్థానికంగా ఔషధాల ధరలను పెంచడం ఇది రెండోసారి. మార్చి మధ్యలో 30 శాతం పెంపు విధించారు. శ్రీలంక వాసులు ఇప్పటికే సుదీర్ఘ కరెంట్‌ కోతలు, ఆహారం, ఇంధనం కొరతతో అల్లాడుతోన్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు 30 శాతంగా నమోదైంది. ఇది వరుసగా ఏడో రికార్డు గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని