Sri Lanka: ఆరు నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు అవసరం: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే

ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మంగళవారం...

Updated : 07 Jun 2022 15:24 IST

కొలంబో: ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం మాత్రమే సరిపోదని.. మొత్తం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖనూ నిర్వహిస్తున్న ఆయన.. ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ‘మధ్యంతర బడ్జెట్‌’పై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. ఎరువుల కొనుగోలు కోసం భారత్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 55 మిలియన్‌ డాలర్ల క్రెడిట్ లైన్‌ను శ్రీలంక కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత ప్రతినిధి మంగళవారం తెలిపారు.

2.2 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీప దేశం ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వల పడిపోయాయి. ఆహారం, ఇంధనం, మందులు తదితరాల కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు. గొటబాయ రాజపక్స, ఆయన కుటుంబ సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక విధానాల కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందంటూ పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గొటబాయ సోదరుడు మహింద రాజపక్స ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు రణిల్‌ విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభ శ్రీలంకను గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని