Sri Lanka: ప్రధాని మార్పునకు శ్రీలంక అధ్యక్షుడు ఓకే.. త్వరలో మధ్యంతర ప్రభుత్వం?

ప్రధానమంత్రి మహింద రాజపక్సను తొలగించి.. ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు.

Published : 30 Apr 2022 02:19 IST

కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో వణికిపోతోన్న శ్రీలంకలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ, ప్రధానమంత్రి మహిందలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి. అయితే, తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇద్దరు నేతలు చెబుతున్నప్పటికీ తాజాగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మహింద రాజపక్సను తొలగించి.. ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.

‘దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టేందుకు గానూ కీలక మార్పులకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. ఇందులోభాగంగా నూతన ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నారు’ అని పార్లమెంట్‌ సభ్యుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితులపై అధ్యక్షుడు గొటబాయతో చర్చించిన అనంతరం ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అధికార కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన 40మందికిపైగా సభ్యుల్లో మైత్రిపాల సిరిసేన ఒకరు. అయితే, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధానమంత్రి మహింద చెప్పిన రెండు రోజుల్లోనే ఆయనను మార్చేందుకు అధ్యక్షుడు సిద్ధం కావడం గమనార్హం.

ఇక రాజపక్స కుటుంబం దూరం..

శ్రీలంకలో అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు అధికార కూటమిలోని 11 పార్టీలతో అధ్యక్షుడు గొటబాయ సమావేశం తలపెట్టారు. అయితే, అధ్యక్షుడి సోదరుడైన ప్రధానమంత్రి మహింద రాజపక్స, ప్రస్తుత కేబినెట్‌ మంత్రులు ఈ భేటీకి దూరంగా ఉంటేనే తాము ఈ సమావేశానికి హాజరవుతామని విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అధ్యక్షుడు గొటబాయతో మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మార్పు గురించి గొటబాయ మైత్రిపాలకు వివరించారు. అంతకుముందు రాజపక్స కుటుంబానికి చెందిన పలువురు మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహింద కూడా పదవి వీడితే శ్రీలంక ప్రభుత్వానికి రాజపక్స కుటుంబం (అధ్యక్షుడు మినహా) మొత్తం దూరమైనట్లే.

ఇదిలాఉంటే, గత ఇరవై ఏళ్లుగా శ్రీలంకను శాసిస్తోన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానమంత్రి మహింద రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కార్మిక సంఘాలు గురువారం సమ్మె చేపట్టాయి. వైద్య రంగంతో పాటు పోర్టులు, విద్యుత్‌, విద్య, పోస్టల్‌ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీగా పాల్గొని రాజపక్స సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంక్షోభాలకు బాధ్యులైన రాజపక్స సోదరులు అధికారం నుంచి తక్షణమే దిగిపోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఇలా గత కొన్నివారాలుగా శ్రీలంకలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు