Sri Lanka crisis: కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు!

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ అక్కడి వైద్యులు చేదు నిజాన్ని వెల్లడించారు. ప్రాణాలు కాపాడే ఔషధాల కొరత ఇలాగే ఏర్పడితే......

Published : 11 Apr 2022 02:07 IST

అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్‌ లేఖ

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదిరిపోతోంది. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిపోయాయి. వీటికి తోడు ఔషధాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి వైద్యులు చేదు నిజాన్ని వెల్లడించారు. ప్రాణాలు కాపాడే ఔషధాల కొరత ఇలాగే ఏర్పడితే.. కరోనా కారణంగా ఈ రెండేళ్ల కాలంలో సంభవించిన మరణాల కంటే ఈ సంక్షోభ మరణాల అధికంగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఆసుపత్రుల్లో పలు రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేక గత నెల రోజులుగా సాధారణ శస్త్రచికిత్సలు నిలిచిపోయినట్లు శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (ఎస్‌ఎల్‌ఎంఏ) వెల్లడించింది. అత్యవసర శస్త్రచికిత్సలు కూడా త్వరలోనే ఆగిపోయే ప్రమాదం పొంచిఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు లేఖ రాసినట్లు ఎస్‌ఎల్‌ఎంఏ పేర్కొంది.‘కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఎవరికి చికిత్స అందించాలో, సౌకర్యాల కొరత కారణంగా ఎవరికి ట్రీట్‌మెంట్‌ అందించలేమో తేల్చుకోలేకపోతున్నాం. పరిస్థితులు ఇలాగే ఉంటే కరోనా మరణాల కంటే ఈ సంక్షోభ మరణాలే ఎక్కువగా ఉంటాయి’ అని లేఖలో పేర్కొంది.

తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభమూ ముదురుతోంది. అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్‌ చేస్తూ గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. శనివారం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న మధ్యాహ్నం అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ముందుకు చేరుకున్న దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఆదివారం తెల్లవారుజాము వరకు అక్కడే నిరసన చేపట్టడం గమనార్హం. రాత్రంతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి కదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని