Srilanka Crisis: ‘అంతా చైనాకే అమ్మేశారు.. అందుకే లంకలో ఆకలి కేకలు..’

ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక విలవిలలాడుతోంది. ధరలు మండిపోతుండటంతో అక్కడి జనం ఆకలి కేకలు పెడుతున్నారు......

Published : 06 Apr 2022 02:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక విలవిలలాడుతోంది. ధరలు మండిపోతుండటంతో అక్కడి జనం ఆకలి కేకలు పెడుతున్నారు. శ్రీలంకలో దయనీయ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.గొటబాయ రాజపక్స ప్రభుత్వం ఆస్ట్రేలియా, నార్వే, ఇరాక్‌లలో రాయబార కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు, రాజపక్స ప్రభుత్వం అంతా చైనాకే అమ్మేసిందటూ ఆహార విక్రేతలు ఆరోపిస్తున్నారు. కొలంబోలోని ప్రధాని మహీంద రాజపక్స ఇంటి వద్ద నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి 10 కీలక పాయింట్ల

  1. శ్రీలంకలోని  గొటబయ రాజపక్స ప్రభుత్వం అంతా చైనాకే అమ్మేసిందంటూ అక్కడి ఆహార విక్రేతలు ఆరోపిస్తున్నారు. తమ దేశంలో ఏమీ లేదనీ.. ఇతర దేశాల నుంచి రుణంపైనే ప్రతిదీ కొనుగోలు చేసిందని వాపోతున్నారు. ‘లంక ప్రభుత్వం ప్రతిదీ చైనాకు అమ్మేస్తోంది. అదే అతి పెద్ద సమస్య. చైనాకు అన్నీ అమ్మేయడంతో శ్రీలంక వద్ద ఇప్పుడు డబ్బులేదు’’ అని ఆరోపించారు.
  2. కొలంబో వీధుల్లోకి విద్యార్థులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వర్షం పడుతున్నా.. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా లెక్కచేయకుండా కదం తొక్కారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొనేందుకు శ్రీలంక పోలీసులు నిరసనల వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
  3. పలువురు ఎంపీల ఇళ్ల వద్ద ఈరోజు నిరసనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రెసిడెన్సియల్‌ సెక్రటేరియట్‌తో పాటు మాజీ ఆర్థికమంత్రి బాసిల్‌ రాజపక్సతో సహా పలువురు మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద మోహరించారు.
  4. దేశంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ గొటబాయ ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ఆయన ఆహ్వానం అర్థంలేనిదిగా కొట్టిపారేస్తున్నాయి. దేశంలో ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో పరిస్థితులు క్షీణించడంతో ఆయన రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి
  5. శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస పిలుపునిస్తున్నారు. అధికారాలు పూర్తిగా అధ్యక్షుడి వద్దే కేంద్రీకృతం కావడంతో ఇలాంటి విపత్కర పరిణామం తలెత్తుందన్నారు.
  6. మరోవైపు, సోమవారం యూనిఫాం ధరించి నిరసనల్లో పాల్గొన్న వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
  7. ఔషధాలు, ప్రాణాల్ని కాపాడే మందులు సైతం కొరత నెలకొనడంతో శ్రీలంక ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
  8. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో ప్రధాని మినహా మిగతా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేవలం నలుగురు మంత్రులను మాత్రమే  కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన గొటబాయ... సోమవారం తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సనూ పదవి నుంచి తప్పించారు. 
  9. బాసిల్‌ రాజపక్స స్థానంలో కొత్త ఆర్థికమంత్రిగా అలీ సబ్రేను ఈరోజు నియమించగా.. 24గంటల్లోపే ఆయనా తన పదవికి రాజీనామా చేయడం శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి నిదర్శనం. 
  10. శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ఐఎంఎఫ్ స్పందించింది. లంకలో రాజకీయ, ఆర్థిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని