Published : 10 May 2022 02:14 IST

Srilanka Crisis: ఎట్టకేలకు గద్దె దిగిన మహీంద.. శ్రీలంక సంక్షోభం ఇలా మొదలైంది..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక(sri lanka)లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా వేల మంది ప్రజల నిరసన హోరుకు ఎట్టకేలకు దిగొచ్చిన ఆ దేశ ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి గుడ్‌బై చెప్పారు. రాజపక్స కుటుంబం అవినీతితో లంకను తీవ్ర అప్పుల్లో ముంచేసిందంటూ ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదుల నిరసన గళం వినిపిస్తున్నా.. రాజీనామాకు ససేమిరా అంటూ వచ్చిన మహీంద రాజపక్స తాజాగా తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయకు పంపడం సింహళ రాజకీయాల్లో కీలక మలుపు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు శ్రీలంకలో ఈ పెను సంక్షోభం ఎప్పుడు మొదలైంది? ఈ విపత్తుకు దారితీసిన కారణాలను ఓసారి అవలోకిస్తే..! 

  1. దాదాపు 2.18 కోట్లకు పైగా జనాభా కలిగి శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు.. ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా శ్రీలంక జనం కొరతతో తీవ్ర అవస్థలు పడ్డారు. 
  2. అసలు సంక్షోభం మొదలైందిలా..: పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పతనమయ్యాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటివి ఎగుమతి చేసే శ్రీలంకకు 2013లో ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు భారీగా పతనం కావడం కూడా ఓ భారీ కుదుపే. వాస్తవానికి అప్పట్నుంచే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూడటం మొదలైందన్నది విశ్లేషకుల మాట. 
  3. అవినీతి, బంధుప్రీతి: సింహళ జాతీయవాదం ముసుగులో రాజపక్స సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. మహీంద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్ని రాజపక్స సోదరులు, బంధువర్గాలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
  4. పదవులూ వాళ్లకే.. నిధులూ వాళ్లవే..: శ్రీలంక హంబన్‌టొటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి అక్కడి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున(శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌)కు చెందిన గొటబాయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్‌ రాజపక్స, బసిల్‌ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా ఉన్నారు. గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్‌, యోషితాలకు కీలక పదవులు దక్కాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గొటబాయ, మహీందలు మినహా మిగతా వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, వీరిద్దరూ కూడా పదవుల నుంచి తప్పుకొంటేనే శ్రీలంకలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75శాతం వరకు నిధులు కేటాయించడం గమనార్హం.
  5. సుంకాల రద్దుతో కటకట: 2019లో గొటబాయ అధికారంలోకి వచ్చిన తర్వాత లంక సర్కారు విలువ ఆధారిత పన్నును 15శాతం నుంచి 8శాతానికి తగ్గించడంతో పాటు, ఏడు ఇతర రకాల పన్నులను రద్దు చేసింది. ధార్మిక సంస్థలను పన్ను పరిధి నుంచి తప్పించింది. ఫలితంగా కేవలం 30 నెలల్లోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. పన్నుల వసూలు దాదాపు సగం తగ్గడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు, ఇతర వస్తువులకు పెద్దయెత్తున చెల్లింపులు చేయాల్సి రావడంతో సమస్య తలెత్తింది. శ్రీలంక ఆర్థిక స్థితిగతులపై ఆసియా అభివృద్ధి బ్యాంకు 2019లో ఒక అధ్యయనం వెలువరించింది. దీని ప్రకారం ఆ దేశంలో ఆదాయంకంటే వ్యయం ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమయింది. ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో పన్నుల శాతం తక్కువే అయినా ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోకుండా పన్నుల శాతాన్ని తగ్గించేశారు. ఫలితంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కోసుకుపోయింది. 
  6. అప్పుల మీద అప్పులు..: ఎల్‌టీటీఈతో పోరాటం సమయంలో లంక బడ్జెట్‌లో భారీ లోటు ఉండేది. మరోవైపు 2008-09లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ పరిస్థితి మరింత కుదేలైంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి లంక ప్రభుత్వం 2.6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బడ్జెట్‌ లోటును 5 శాతానికి తగ్గిస్తామన్న షరతు మీద రుణం పొందింది. తర్వాత కూడా ఎగుమతులు పుంజుకోలేదు. విదేశీ నిల్వలు దిగజారిపోతూనే ఉన్నాయి. దీంతో అప్పటి యూఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వం 2016లో మరోసారి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. 1.5 బిలియన్‌ డాలర్ల రుణం పొందింది. 2020 నాటికి ఆర్థిక లోటును 3.5 శాతానికి తగ్గించడం, వ్యయ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాణిజ్యవిధానాల అమలు, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం వంటి షరతుల మీద ఈసారి ఐఎంఎఫ్‌ రుణాన్ని మంజూరు చేసింది. ఇది లంక ఆర్థిక స్థితిని మరింత ఒత్తిడికి గురి చేసింది. 
  7. సంక్షోభానికి ‘ఎరువు’: విదేశీ మారక నిల్వల పొదుపునకు ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. కృత్రిమ ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి సంక్షోభానికి దారితీసింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30 శాతం మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని సైతం ప్రభుత్వం పెడ చెవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. 
  8. మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, టూత్‌ బ్రష్‌లు ఇతరత్రావాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకపోయింది. అయితే, నిత్యావసర ఆహార వస్తువులైన పప్పులు, పంచదార, గోధమ పిండి, కూరగాయలు, వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డిమాండ్‌, సరఫరాకు మధ్య నెలకొన్న తీవ్ర అంతరంతో పెను సంక్షోభం ఏర్పడింది.
  9. సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్‌ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోతుండగా.. కొందరు మరణించారు. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
  10. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. ఇప్పటికే విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక.. మొత్తం 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని ఇటీవల ప్రకటించింది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. భారత్‌ తన ఆపన్న హస్తాన్ని అందించి, క్లిష్ట సమయంలో తనవంతు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. 
Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts