Sri Lanka Crisis: నిన్న మంత్రిగా బాధ్యతలు.. 24 గంటల్లో రాజీనామా

ఓ వైపు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం నానాటికీ తీవ్రంగా మారుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం

Published : 05 Apr 2022 17:38 IST

కొలంబో: ఓ వైపు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం నానాటికీ తీవ్రంగా మారుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం నుంచి కొన్ని మిత్రపక్షాలు వైదొలిగాయి. దీంతో పార్లమెంట్‌లో రాజపక్స పక్షం మెజార్టీ కోల్పోయినట్లైంది. మరోవైపు 24 గంటల్లోనే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ సర్బీ.. నేడు ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

అధికార శ్రీలంక పోడుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని 42 మంది ఎంపీలు మంగళవారం ప్రకటించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఇక నుంచి తామంతా పార్లమెంట్‌లో స్వతంత్రులుగా ఉంటామని తెలిపారు. ‘‘మా పార్టీ ఇక నుంచి ప్రజల వైపే. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఫ్రీడమ్‌ పార్టీ నేత మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.

2020లో జరిగిన శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీపీ నేతృత్వంలోని కూటమి 146 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇందులో నుంచి 42 మంది సభ్యులు మద్దతు ఇవ్వకపోవడంతో పార్లమెంట్‌లో గొటబాయ రాజపక్స బలం 102కు తగ్గింది. 225 సభ్యులున్న పార్లమెంట్‌లో మెజార్టీ మార్క్‌ 113. దీంతో ప్రస్తుతం రాజపక్స మెజార్టీ కోల్పోయినట్లయింది. అయితే అధ్యక్ష ఎన్నికలు వేరుగా జరుగుతాయి. దీంతో పార్లమెంటులో మాత్రమే మెజార్టీ కోల్పోయారు కాబట్టి అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తప్పుకున్న ఆర్థిక మంత్రి..

నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో ప్రధాని మినహా మిగతా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేవలం నలుగురు మంత్రులను మాత్రమే కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన గొటబాయ... సోమవారం తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను కూడా పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో అలీ సర్బీకి ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. అయితే ఈ పదవి చేపట్టిన 24 గంటల్లోపే సర్బీ రాజీనామా చేయడం గమనార్హం.  ఈ మేరకు అధ్యక్షుడికి లేఖ రాశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు తాను ఆర్థిక మంత్రిగా కొనసాగలేనని, ఆ స్థానంలో మరో ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని