The Terminal: రియల్‌ ‘ది టెర్మినల్‌’ మ్యాన్‌ ఇక లేరు!

ది టెర్మినల్‌ మ్యాన్‌గా పాపులర్ అయిన మెహ్రాన్‌ కరీమీ నస్సేరి గుండెపోటుతో చనిపోయినట్లు పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ఈయన జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ది టెర్మినల్‌ అనే సినిమాను తెరకెక్కించారు. 

Updated : 14 Nov 2022 10:57 IST

పారిస్‌: కొన్ని సినిమాలను కల్పిత కథలతో రూపొందిస్తే, మరికొన్ని నిజజీవితంలోని వ్యక్తులు, సంఘటనల ఆధారంగా తీస్తుంటారు. అలా వాస్తవ కథల స్ఫూర్తితో నిర్మించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌ తీసిన ‘ది టెర్మినల్‌’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. దౌత్యపరమైన కారణాలతో 18 ఏళ్లుగా పారిస్‌లోని ఛార్లెస్‌ డిగాల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయిన ఓ వ్యక్తి కథతో ఈ సినిమా తీశారు. ఆయనే మెహ్రాన్‌ కరీమీ నస్సేరి. శనివారం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

మెహ్రాన్‌ 1988లో పారిస్‌ విమానాశ్రయానికి రాగా, దౌత్యపరమైన కారణాలతో ఆయన్ను పారిస్‌లోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన విమానాశ్రయంలోని టెర్మినల్‌లో ఉండిపోయారు. ఈ కథతో 2004లో స్పీల్‌బర్గ్‌ ‘ది టెర్మినల్‌’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మెహ్రాన్‌ పాత్రను ప్రముఖ నటుడు టామ్‌ హ్యాంక్స్‌  పోషించారు. తర్వాత కూడా ఎంతోమంది ఆయన పరిస్థితిపై డాక్యుమెంటరీలు రూపొందించారు. దీంతో ది టెర్మినల్‌ మ్యాన్‌గా నస్సేరి పాపులర్‌ అయ్యారు. 2006లో అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. తర్వాత పారిస్‌లో ఉండేందుకు అనుమతించడంతో, అక్కడి హాస్టల్‌లో  నివసించేవారు. కొద్దివారాల క్రితం తిరిగి విమానాశ్రయానికి వచ్చిన ఆయన, శనివారం గుండెపోటుతో చనిపోయారని అధికారులు తెలిపారు.  

నస్సేరి 1945లో ఇరాన్‌లో జన్మించారు. తన తల్లిని వెదుకుతూ బ్రిటన్‌ చేరుకున్న ఆయనకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించడంతో కొద్దిరోజులు విమానాశ్రయంలో గడిపి, పారిస్‌కు చేరుకున్నారు. అక్కడి అధికారులు సైతం అనుమతి నిరాకరించడంతో ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ వన్‌లో ఇంటర్నేషనల్‌ లాంజ్‌లో ఉండిపోయారు. తర్వాత ఆయన కథ సినిమాగా రావడంతో ది టెర్మినల్‌ మ్యాన్‌గా పాపులర్ అయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని