London: లండన్‌లో తుపాను బీభత్సం.. ‘డేంజర్‌ టు లైఫ్‌’ హెచ్చరిక

యూనిస్‌ తుపాను లండన్‌ నగరాన్ని వణికిస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి.

Published : 18 Feb 2022 23:49 IST

లండన్‌: యూనిస్‌ తుపాను లండన్‌ నగరాన్ని వణికిస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. విమానాలు, రైళ్లు, ఓడల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రజాజీవనం స్తంభించింది. లక్షలాది మంది ఇళ్లకే పరిమితం కావడంతో లండన్‌ వీధులన్నీ ఖాళీగా మారిపోయాయి. ఈ భీకర గాలుల నేపథ్యంలో లండన్‌లో ‘రెడ్‌ అలెర్ట్‌’ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేసింది.

ఇంగ్లాండ్‌ రాజధానిలో గతంలో ఎన్నడూలేని విధంగా తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇదే రికార్డు స్థాయి అని వెల్లడించారు. భీకర గాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఊడిపోగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. గాలుల ధాటికి అక్కడక్కడా ట్రక్కులు కూడా రోడ్డుపై అడ్డంగా పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పై వంతెనలను మూసివేశారు. తుపాను ప్రభావంతో తీరంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు పెద్దఎత్తున మంచు కురుస్తోంది. దీంతో లండన్‌లో మొదటిసారిగా ‘రెడ్‌’ అలెర్ట్‌ జారీ చేశారు. పాఠశాలలు మూసివేడంతో పాటు ప్రజా రవాణా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌నూ నిలిపివేశారు.

తుపాను పరిస్థితులను ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముందుజాగ్రత్తగా సైన్యాన్ని సిద్ధంగా ఉంచామని చెప్పారు. వాతావరణ శాఖ, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రజలకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని