Mexico: డ్రగ్స్ డాన్‌ను పట్టుకుంటే ఇంత విధ్వంసమా.. అంత ధైర్యమెక్కడిది?
మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్ గుజ్మన్‌ను అరెస్టు చేసిన తర్వాత ముఠా సభ్యులు మారణహోమం సృష్టించారు. పటిష్ఠ భద్రత ఉన్న విమానాశ్రయంపైనే కాల్పులు జరిపారు. ఆ ముఠాకు అంతధైర్యం ఎక్కడిది? గుజ్మన్ చరిత్ర ఏంటి?
ఇంటర్నెట్‌డెస్క్: మెక్సికోలో పేరుమోసిన డ్రగ్ మాఫియా సూత్రధారి ఎల్ చాపో కుమారుడు ఒడివియో గుజ్మన్ లోపెజ్‌ను అరెస్టు చేసిన క్రమంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. తమ నాయకుడిని అరెస్టు చేశారన్న కోపంతో ముఠా నాయకులు ఏకంగా విమానాశ్రయంపైనే దాడికి దిగారు.. ఎక్కడికక్కడ రహదారులు దిగ్బంధించి మారణకాండ సృష్టించారు. మిలటరీ సిబ్బంది, డ్రగ్ నిందితులుగా భావిస్తున్నవారంతా కలిసి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అరాచక పర్వానికి మెక్సికోలోని సినలోవా రాష్ట్రం వేదికగా నిలిచింది. అసలెవరీ గుజ్మన్ లోపెజ్.. డ్రగ్స్ సరఫరా ముఠాకు అంత ధైర్యమెలా వచ్చింది?
గుజ్మన్ లోపెజ్ గురించి తెలుసుకునే ముందు అతడి తండ్రి ఎల్ చాపో గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అగ్రరాజ్యం అమెరికాకు వేలాది టన్నుల డ్రగ్స్‌ను సరఫరా చేసి చివరికి పట్టుబడిన డ్రగ్ మాఫియా కింగే ఎల్ చాపో. కొకైన్, హెరాయిన్, మెతాంపటమైన లాంటి మాదక ద్రవ్యాలను ఎంతో చాకచక్యంగా అమెరికాకు తరలించి కోట్లకు పడగలెత్తాడు. 2009 ప్రపంచ కుబేరుల జాబితాలో 701 స్థానం సంపాదించాడంటే డ్రగ్స్‌తో ఎంతలా కూడబెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. తిరుగులేని మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అతడిని పోలీసులు అరెస్టు చేసి మెక్సికన్ జైలులో బంధించారు. 2015లో అక్కడి నుంచి సొరంగం ద్వారా పారిపోయాడు. ఆ తర్వాత మెక్సికన్ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి 2017లో అమెరికాకు అప్పగించారు. అతడిపై డ్రగ్ సరఫరాతోపాటు మనీలాండరింగ్ తదితర 10 కేసులు నమోదు చేసిన అమెరికా.. 2019లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి అతడు అమెరికా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
తండ్రి బాటలోనే ‘ది మౌస్’
తండ్రి జైలుకు వెళ్లిన తర్వాత ముఠా బాధ్యతలను అతడి కుమారుడు గుజ్మన్ లోపెజ్ తీసుకున్నాడు. డ్రగ్‌మాఫియా సామ్రాజ్యంలో తండ్రిని మించిన తనయుడిలా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కేవలం డ్రగ్ సరఫరాతోపాటు తన ముఠా సభ్యులతో రౌడీయిజం, హత్యలకు కూడా వెనకాడేవాడు కాదు. తండ్రి జైలుకు వెళ్లినా కార్యక్రమాలు ఏమాత్రం ఆగలేదని, వాటన్నింటినీ గుజ్మన్ కొనసాగిస్తున్నాడని అక్కడి అధికారులకు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే, ‘ది మౌస్’ అని పేరుబడ్డ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించి పలుమార్లు పోలీసులు విఫలమయ్యారు. చివరికి భారీ మిలటరీ ఆపరేషన్ చేపట్టి క్యూలియకాన్‌లో అతడిని అరెస్టు చేశారు. గుజ్మన్‌ను అరెస్టు చేశారన్న విషయం తెలియగానే ముఠా సభ్యులు రెచ్చిపోయారు. ఎక్కడిక్కడ రోడ్లను దిగ్బంధించి విధ్వంసానికి పాల్పడ్డారు.డజన్ల కొద్దీ వాహనాలకు నిప్పు పెట్టారు. ఏకంగా విమానాశ్రయంపైకే దాడికి దిగారు.
అధికారులకు ముచ్చెమటలు
సినలోవా పేరు వినగానే అక్కడి అధికారులకు ముచ్చెమటలు పడతాయి. దాదాపు 58,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఆ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాదే రాజ్యం. స్థానిక నేతలకు వారు ఏది చెప్తే అదే వేదం. పేరుకే నాయకులు గానీ పాలన అంతా దాదాపు వీరి కనుసన్నల్లోనే సాగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రాష్ట్రంలో పని చేయాల్సి వస్తే అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ నిర్ణయం తీసుకుంటారు. పటిష్ఠ భద్రత ఉండే విమానాశ్రయంపైనే దాడులకు దిగారంటే వారి సామర్థ్యాన్ని, స్థానికంగా వారికున్న పట్టును అంచనా వేయొచ్చు.
వారంతా నమ్మిన బంటులు
గుజ్మన్ లోపెజ్‌కు స్థానికుల నుంచి మద్దతు పుష్కలంగా ఉంటుంది.అందుకే ఆ డ్రగ్ కింగ్‌ను పట్టుకోవడం అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన సొమ్మును కేవలం తాను మాత్రమే అనుభవించకుండా.. అక్కడి ప్రజలకు గుజ్మన్ పంచిపెడుతుంటాడు. అందువల్ల వారంతా ఈ ముఠాకు మద్దతుగా నిలుస్తుంటారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు యువకులను ఆకర్షించేలా గుజ్మన్ లోపెజ్ వారికి ఆర్థిక సహకారం చేస్తుంటాడు. దీంతో వారంతా అతడికి నమ్మిన బంటులా పని చేస్తారు. డ్రగ్స్ సరఫరా కత్తిమీద సాములాంటిదని తెలిసినా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. ఆ నమ్మకమే గుజ్మన్ లోపెజ్‌కు కలిసొచ్చింది. ప్రభుత్వాన్నే శాసించే శక్తిగా ఎదిగేలా చేసింది. మరోవైపు ఉత్తర అమెరికా దేశాల నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెక్సికోకు రావాల్సి ఉంది. అయితే, సోమవారం రావాల్సిన ఆయన ఒక రోజు ముందుగా ఇవాళే చేరుకుంటున్నట్లు మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సిలో ఎబ్రాడ్ తెలిపారు. ఎల్ చాపో అమెరికాలో శిక్ష అనుభవిస్తుండటం, తాజాగా గుజ్మన్ కూడా అరెస్టయిన నేపథ్యంలో అధ్యక్షుడు జోబైడెన్ ఖరారైన షెడ్యూల్‌కు ముందే మెక్సికోకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Baharla Ha Madhumas: యూట్యూబ్, ఇన్‌స్టాలో ఈ పాటదే ఇప్పుడు ట్రెండ్!
-
Sports News
Anand Mahindra: ఐపీఎల్ ఫైనల్‌పై వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
-
Politics News
Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్