Earth quake: పర్వత సానువుల్లో చిక్కుకున్న 400మంది పర్యాటకులు సురక్షితం

తైవాన్‌(taiwan)లో నిన్న సంభవించిన భారీ భూకంపం(Earthquake)తో పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయిన 400 మంది.....

Published : 20 Sep 2022 01:42 IST

తైపీ: తైవాన్‌(taiwan)లో నిన్న సంభవించిన భారీ భూకంపం(Earthquake)తో పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయిన 400 మంది పర్యాటకులు సురక్షితంగా కిందకు చేరుకున్నారు. పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను నిన్న రాత్రి నుంచి సురక్షితంగా కిందకు చేర్చగా.. మరో 90మంది ఈ ఉదయం చేరుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది. తైవాన్‌ ఆగ్నేయ తీర ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అనేక ప్రాంతాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు చిక్కుకుపోయారు. భూప్రకంపనలతో ధ్వంసమైన వాటి మరమ్మతు పనులు ప్రారంభించారు.

మరోవైపు, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చిన్నపాటి ప్రకంపనలు ద్వీపాన్ని తాకినప్పటికీ అవి అంత తీవ్రతను చూపించలేదని అధికారులు పేర్కొన్నారు. తైవాన్ రవాణాశాఖ మంత్రి హువాలియన్ కౌంటీలోని ఓ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. భూకంపం సంభవించిన సమయంలో దెబ్బతిన్న ట్రాక్‌లను పరిశీలించారు. వీటన్నింటినీ మరమ్మతు చేయడానికి దాదాపు నెల సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.

అయితే, శనివారం ఇదే ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూమి కంపించినప్పుడు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, ఆ ప్రకంపనలు చెలరేగిన 24 గంటల్లోపే అంతకంటే కొంత ఎక్కువ తీవ్రతతో భూకంపం రావడంతో యూలిలో పర్వత ప్రాంతంలో దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోగా.. వారంతా సురక్షితంగా కిందకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు, నిన్నటి భూకంపంతో ప్రయాణికుల రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్లాట్‌ఫాం పైకప్పు విరిగి రైలుపై పడిన ఘటనలో ఆరు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని